టీ షర్ట్‌ను మించిన వివాదంలో రాహుల్... జార్జ్ పొన్నయ్యతో భేటీపై బీజేపీ కౌంటర్స్
*బీజేపీ విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్
Rahul Gandhi: మొన్న లగ్జరీ కంటైనర్లపై రచ్చ.. నిన్న కాస్ట్‌లీ టీ షర్ట్‌పై రగడ.. ఇవాళ పాస్టర్ జార్జ్ పొన్నయ్యతో భేటీ వివాదం. ఇలా రోజుకో వివాదంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రచ్చ రేపుతోంది. ఇవాళ ఉదయం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కేథలిక్ పాస్టర్ జార్జ్ పొన్నయ్యతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ అడిగిన ప్రశ్నే ఇప్పుడు బీజేపీకి అస్త్రంగా మారింది. ఏసుక్రీస్తు భగవంతుని రూపమా.. అది నిజమేనా అన్న రాహుల్ ప్రశ్నకు జార్జ్ పొన్నయ్య అంతే వివాదాస్పదమైన సమాధానం ఇచ్చారు. ఏసు క్రీస్తు ఒక్కరే నిజమైన దేవుడని, అది మీ శక్తి లాంటిది కాదన్నారు. ఇంకేముంది దీనిపై బీజేపీ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోంది. శక్తి తరహాలో కాకుండా జీసస్ మాత్రమే భగవంతుడు అని పాస్టర్ చెప్పడమేంటని నిలదీస్తోంది. ట్వీట్లూ, కౌంటర్లతో కమలం నేతలు రాహుల్, కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తున్నారు.
మరోవైపు.. బీజేపీ విమర్శలకు హస్తం పార్టీ నుంచీ అదే స్థాయిలో కౌంటర్లు వచ్చాయి. తమకు ఎవరి పట్ల ప్రత్యేకమైన ధ్వేషం లేదని, దేశంలోని అందరి గురించి ఆలోచిస్తామని, అందరినీ కలుస్తామని కౌంటర్లు ఇస్తున్నారు. గోలి మారో అంటూ విధ్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్‌ని కూడా తాము కలిసామని, అతడితో మాట్లాడామని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానిస్తే.. వీడియోలో ఉన్నది ఒకటైతే దానికి వక్రభాష్యాలు పూసి బీజేపీ ప్రచారం చేస్తోందని, అయినా బీజేపీ ఫేక్ ఫ్యాక్టరీలో ఇలాంటివి తయారు కావడంపై ఆశ్చర్యం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తిప్పికొట్టారు.