అన్నాడీఎంకేలోకి శశికళను తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శశికళ రాకపై పన్నీరుసెల్వం సుముఖత వ్యక్తం చేయగా పళనిస్వామి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి, పన్నీరుసెల్వంలపై బీజేపీ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
చిన్నమ్మ శశికళను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ అన్నాడీఎంకే నేతలపై ఆధిపత్యం వహించగల చిన్నమ్మతో కలిసి సాగుదామని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. బీజేపీలోని కొంతమంది నేతలు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శశికళ కలిసి సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ఎత్తులకు పైయెత్తులు వేస్తోంది. తాము అనుకున్నది జరగనిపక్షంలో వెంటనే వ్యూహం మారుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఆఖరి క్షణంలో తనకు దక్కనీయకుండా అడ్డుపడి జైలుకు పంపిన బీజేపీపై శశికళ కత్తికడతారా లేక అవసరార్థం కలసి సాగుతారా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
మరోవైపు ఆది నుంచి బీజేపీ అగ్రనేతలతో సన్నిహితంగా వున్న ఉపముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం వైఖరి ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. బీజేపీ శశికళతో చేతులు కలిపితే ఓపీఎస్ అందుకు భిన్నంగా నడుచుకోబోరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి వచ్చిందే బీజేపీ అధిష్ఠానం దయతోనని, అందువల్ల ఆ పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ఆయన నడచుకోరని అన్నాడీఎంకేలోని సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ నేతలు సైతం ఓపీఎస్‌తో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.