జనంపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. ఎమ్మెల్యేను పొట్టు పొట్టుగా కొట్టిన జనాలు..
Prashant Jagdev: ఒడిశా ఖుర్ధాలో లఖింపుర్ ఖేరీ తరహాలోనే మరో సంఘటన జరిగింది.
Prashant Jagdev: ఒడిశా ఖుర్ధాలో లఖింపుర్ ఖేరీ తరహాలోనే మరో సంఘటన జరిగింది. ప్రజలపైకి ఒడిశా ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్‌దేవ్ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 22 మందికిపైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. వారిని హుటాహుటిన భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు.
పంచాయతీ సమితి చైర్ పర్సన్ ఎన్నికలు జరుగుతుండగా ఖుర్దా జిల్లాలోని బాన్‌పుర్ బ్లాక్ ఆఫీసు ముందు నిల్చున్న ప్రజలపై బీజేడీ బహిష్కృత ఎమ్మెల్యే జగ్‌దేవ్ కారు దూసుకెళ్లింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ఆ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఘటనా సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే జగ్‌దేవ్‌ను పోలీసులు రక్షించి భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించారు. జగ్‌దేవ్..పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో గతేడాది సెప్టెంబర్‌లో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు బీజేడీ అధికారులు ప్రకటించారు.