Bihar Elections: బీహార్ లో ఎన్నికలకు సిద్ధం అవుతున్న ఎన్నికల సంఘం!

Bihar Elections | కరోనాతో సహజీవనం చేయాల్సిందే. దాని దారి దానిది.. దాన్ని తప్పించుకుంటూ ముందుకు పోవాల్సిందే!

Update: 2020-09-05 13:47 GMT

కరోనా దెబ్బతో ఎన్నో వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయిన పరిస్థితి. ఇక రాజకీయాల సంగతి చెప్పక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పెట్టిన స్థానిక ఎన్నికల చిచ్చు ఇంకా ఆరలేదు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా విషయంలో చేసిన వ్యాఖ్యలూ మర్చిపోలేం. వాటిని సమర్ధించడం కాదుకానీ.. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు దాదాపు అదేవిధంగా ఉన్నాయి. 'కరోనాను కారణంగా చూపుతూ ఎన్నికలను ఆపలేమని' సుప్రిం కోర్టు స్పష్టం చేసింది. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరపడానికి వీలుగా సుప్రీం తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరపడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది. బీహార్ లో నవంబర్ 29 లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా నేపధ్యంలో ఈ ఎన్నికల నిర్వహణ ఎలా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాల్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకత్వాలు జరీ చేసింది. రాష్ట్రాలు అన్నీ వాటి వెసులుబాటును బట్టి వాటిని పాటించాలని చెప్పింది. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు కేంద్ర సూచనలు పరిగణన లోకి తీసుకుంటూనే తమ రాష్ట్ర పరిధిలోని విషయాలకు అనుగుణంగా కరోనా కట్టడికి స్వతంత్రంగా చర్యలు తీసుకుంటున్నాయి.

ఇక కరోనా వైరస్ తో వచ్చే పెద్ద ముప్పు ఏమిటంటే.. కరోనా సోకినా వ్యక్తి పట్టుకున్న ఏ వస్తువునైనా ఇతరులు పట్టుకున్నపుడు సులువుగా అవతలి వ్యక్తికి వైరస్ సులువుగా సోకుతుంది. అందుకే, ప్రభుత్వాలు బయో మెట్రిక్ విధానాన్ని కూడా పక్కన పెట్టేశాయి. ఈ విపత్కర నేపధ్యంలో ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం అసలు సాధ్యం అవుతుందా?

ఈవీఎంల ద్వారా ఓటు వేయాల్సిన పరిస్థితిలో కరోనాకు చికకుండా ఈ కసరత్తు ఎలా పూర్తి చేయగలరనేది పెద్ద ప్రశ్న. ఇది సాహసోపెతమనే చెప్పాలి. అందులోనూ బీహార్ లాంటి రాష్ట్రంలో ఎన్నికలంటే మామూలు విషయం కాదు. ఆ సాహసాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చాలెంజింగ్ గా తీసుకుంది. ఎటువంటి పరిస్థితిలోనూ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉంది.

ఈ విషయంలో ఎలా వ్యవహరించాలి అనే అంశంలో తీవ్ర కసరత్తులు చేస్తోంది. పోలింగ్ నిర్వహించడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది ఎన్నికల సంఘం. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేకంగా ఓటరు స్లిప్పులు ఇచ్చి వారిని పోలింగ్ చివరి గంటలో ఓట్లు వేసే విధంగా చేయాలనేది ముఖ్యమైన ఆలోచనగా చెబుతున్నారు. ఇక ప్రతి ఓటరు గ్లౌజులు, మాస్క్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధన తూచా తప్పకుండా పాటించేలా చేయాలనేది ఇంకో ముఖ్యమైన నిర్ణయం. అయితే, దాదాపు ఏడుకోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్న బీహార్ లో అందరికీ గ్లౌజులు, మాస్క్ లు అందించడం చాలా కష్టతరమైన విషయం. దీనిని ఎన్నికల సంఘం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా హాండిల్ చేస్తాయనేది ముఖ్యమైన విషయంగా చెప్పొచ్చు. ఇన్ని రిస్క్ ల మధ్య కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద సాహసానికి పూనుకుందనె చెప్పాలి. వారి ప్రణాళికల ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే అది కరోనాపై విజయంగా చరిత్ర సృష్టిస్తారు. ఎక్కడన్నా తేడా కొట్టిందా..దేశ వ్యాప్తంగా వెల్లువెత్తే విమర్శల జడివానలో మునిగిపోతారు. రెండోది జరగకూడదనే ఆశిద్దాం. 

Tags:    

Similar News