Ekta Kapoor: బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌కు అరెస్ట్ వారెంట్
Ekta Kapoor: ట్రిపుల్ ఎక్స్ వెబ్‌సిరీస్‌లో సైనికుల కుటుంబాలపై అభ్యంతరకర సన్నివేశాలు
Ekta Kapoor: సరిహద్దుల వెంబడి దేశాన్ని కాపాడే సైనికులంటే.. అందరిలో గౌరవభావమే. వారక్కడ అనుక్షణం మెలకువతో ఉంటేనే.. ఇక్కడ మనం హాయిగా నిద్రపోతున్నాం. ఇదెవ్వరూ కాదనలేని సత్యం. కానీ అలాంటి సైనికుల కుటుంబాలపై ఇప్పటికీ చిన్నచూపే. ఎన్నో సినిమాలు, మరెన్నో సిరీసుల్లో సైనికుల భార్యల క్యారెక్టర్లను దిగజార్చేలా చూపిస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌గా ట్రిపుల్ ఎక్స్ పేరుతో వచ్చిన వెబ్ సిరీస్‌లో వచ్చిన ఇలాంటి కంటెంట్.. దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అసలు ట్రిపుల్ ఎక్స్ వెబ్‌సిరీస్‌లో ఏముంది..?
చాలా కాలం తర్వాత బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ వార్తల్లోని వ్యక్తిగా మారిపోయారు. బాగా సంపన్నురాలైన ఈమె గతంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే ఈ సారి ఏకంగా బిహార్ లోని ఓ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ ను అందుకున్నారు. అందుకు కారణం.. ఆమె తీసిన ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరీస్. తన నిర్మాణ సంస్థ అయిన బాలాజీ టెలీ ఫిల్మ్స్‌పై ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. అలాగే సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆల్ట్ బాలాజీ నుంచి స్ట్రీమింగ్ చేశారు. ప్రస్తుతానికి రెండు సీజన్లు రిలీజ్ కాగా.. 2018 లో మొదటి పార్ట్.. 2020 లో సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యాయి. రెండూ జనాధరణ పొందాయి. వ్యూస్ పరంగా హిట్ అయ్యాయి.
అయితే ట్రిపుల్ ఎక్స్ సెకండ్ సీజన్‌లో.. సైనికుల కుటుంబాలను అభ్యంతరకరంగా చూపించారంటూ 2020 లోనే బీహార్ లోని బేగుసరైకు చెందిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ శంభు కుమార్.. కోర్టులో పిటీషన్ వేశాడు. సైనికుల కుటుంబాలను అవమానించారని.. దేశ సైనికుల భార్యలను తప్పుగా చూపించారని.. వారిని ఉద్దేశిస్తూ ఉన్న పలు సన్నివేశాలు.. కించపరిచే విధంగా ఉన్నాయని.. పేర్కొన్నాడు. వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా.. కుటుంబ విలువలకు వ్యతిరేకంగా చిత్రీకరించారని వివరించాడు. సైనిక ఉద్యోగ కుటుంబాల సెంటిమెంట్లను దెబ్బతీశారని స్పష్టం చేశారు. ఈ వెబ్ సిరీస్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని.. కోరారు. పిటీషన్‌ను విచారించిన కోర్టు.. అప్పట్లోనే నిర్మాతలైన తల్లీ కూతుళ్లు ఏక్తా కపూర్, శోభా కపూర్‌లకు నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. అయితే వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో.. తాజాగా నిర్మాతలిద్దరికీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు.. ఈ వారెంట్ జారీ చేసింది. అయితే కోర్టు నుంచి నోటీసులు అందుకున్న తర్వాత.. సెకండ్ సీజన్‌లో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించినట్లు కోర్టుకు తెలిపారు. కానీ వ్యక్తిగతంగా హాజరుకాలేదు. దీంతో పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. నిర్మాతలకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఓటీటీల్లో అడల్ట్ కంటెంట్‌కు సెన్సార్ లేకపోవడంతో.. ఇలాంటి వెబ్ సిరీస్‌లకు యూత్ అట్రాక్ట్ అవుతోంది. దీంతో అలాంటి సీరిస్‌లను వరుసగా లాంచ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఎక్స్ ఫస్ట్ సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. సెకండ్ సీజన్‌ను ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందించారు. కానీ ఇందులో సైనికుల కుటుంబాలను నీచంగా చూపించడంపైనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బిహార్‌తో పాటు.. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ వివాదంపై నెటిజన్ల నుంచి ఏక్తాకపూర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా కూడా మనీ కోసం ఇలాంటి సిరీస్‌లు నిర్మించడం ఏంటంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్‌లోని అతి కొద్దిమంది మహిళా నిర్మాతల్లో ఒకరైన ఏక్తా కపూర్.. ఇప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఏజ్ బారైన ఈ లేడీ బ్యాచ్‌లర్.. పేరుకు బాలాజీ టెలీ ఫిల్మ్స్ అంటూ.. దేవుడి పేరుతో బ్యానర్‌ను ఏర్పాటు చేసినా.. ఆ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన చాలా సినిమాలు, సీరియళ్లలో అడల్ట్ కంటెంటే ఎక్కువ. గతంలో డర్టీపిక్చర్, ఫోర్ ప్లే వంటి సినిమాలు తీసిన ఈ నిర్మాత.. పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ మధ్య వచ్చిన లాకప్ అనే రియాల్టీ షో వివాదాస్పదమైంది. పలు కాంట్రావర్షియల్ సినిమాలు, షోలు చేస్తూ.. వార్తల్లో వ్యక్తిగా ఉంటుంది. ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్ థర్డ్ సీజన్‌పై ఫోకస్ చేశారు.