Nitish Kumar: ఎవరిని నమ్మాలో తెలియడం లేదు.. విత్రపక్షం బీజేపీపై పరోక్ష వ్యాఖ్యలు
బిహార్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుదో ఎవరూ ఊహించలేం.
బిహార్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుదో ఎవరూ ఊహించలేం. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీహార్ లో తమ మిత్రపక్షం బీజేపీపై పరోక్ష విమర్శలు చేస్తూ పలు ఊహాగానాలకు తెరతీస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో సీఎంగా నితీశ్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీ నాయకుల వ్యవహరిస్తున్నతీరుతో నితీశ్ అసంతృప్తి చెందుతున్నారు. దీని కారణం ఇటీవల అసోంలో జరిగిన పరిణామాలు బీజేపీ-జేడీ (యూ) మధ్య స్పర్ధలకు బీజం వేసినట్లు కనిపిస్తోంది.
పాట్నా వేదికగా జరిగిన జేడీ (యూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తొలి రోజు నితీశ్ మాట్లాడుతూ..ఎన్నికలప్పుడు శత్రువులెవరు? మిత్రులెవరు? అని తెలియకుండానే పోరాటం చేశామని వ్యాఖ్యానించారు. ఆయన నేరుగా బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయకపోయినా... జేడీయూ వర్గాలు మాత్రం మిత్రపక్షాన్ని దృష్టిలో పెట్టుకునే నితీశ్ వ్యాఖ్యలు చేశారని పేర్కొంటున్నాయి.
అంతేకాదు, శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన జేడీయూ నేతలు బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధినేతకు తెగేసి చెప్పినట్లు సమాచారం. జేడీయూ సీనియర్ నేతలు చంద్రికా రాయ్, బోగో సింగ్, జయకుమార్ సింగ్, లలన్ పాశ్వాన్, అరుణ్ మాంఝీ తదితరులు బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. తాము ఎల్జేపీ వల్ల ఓడిపోలేదని, బీజేపీ కారణంగా ఓడిపోవాల్సి వచ్చిన విషయాన్ని నితీశ్ దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీపై ఆగ్రహంతో సీనియర్లు మాట్లాడినా... జేడీయూ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్, సీఎం నితీశ్ మౌనంగా వింటూ ఉండిపోయారు.
ఇటీవలే సీఎం నితీశ్ కుమార్ తను ముఖ్యమంత్రి పీఠంపై ఆశలులేవని పెద్ద బాంబే పేల్చారు. జేడీయూ అధ్యక్షుడిగా తప్పుకుంటూ.. ఆయన సన్నిహితుడు సీనియర్ నేత ఆర్సీపీ సింగ్ ను నియమించిన విషయం తెలిసిందే.