Fake IPS Officer: ఐపీఎస్ ఆఫీసర్‌నని చెప్పుకుని పోలీసు స్టేషన్‌కి వెళ్లాడు.. ఆ తరువాతి కామెడీ ఏమైందంటే..

Update: 2024-10-04 13:13 GMT

Fake IPS Officer Story: ఇదొక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ స్టోరీ. అచ్చం సినిమాలో కామెడీ సీన్‌ని తలదన్నేలా ఉన్న ఈ ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ స్టోరీ చూస్తే ఎవరికైనా నవ్వాగదు. పోలీసులనే బురిడి కొట్టించేందుకు ప్రయత్నించిన ఈ యువకుడు, వారికి స్టోరీల మీద స్టోరీలు చెప్పాడు. అదేంటంటే.. సెప్టెంబర్ 20న బీహార్‌లోని జాముయి పోలీసు స్టేషన్‌లోకి ఓ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎస్ ఆఫీసర్ యూనిఫామ్‌లో, నడుంకి గన్ ఉన్న బెల్ట్ ధరించి మరీ ఎంట్రీ ఇచ్చిన ఆ యువకుడు తనని తాను ఐపీఎస్ ఆఫీసర్ మితిలేష్ కుమార్ మాంఝీ అని పరిచయం చేసుకున్నాడు. తనని తాను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి అతడు అక్కడున్న పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ నిండా రెండు పదుల వయస్సు కూడా లేని ఆ యువకుడి వాలకం చూస్తే అక్కడున్న పోలీసులకు అనుమానం రానే వచ్చింది. తమదైన స్టైల్లో ప్రొసీడ్ అవడంతో ఆ యువకుడి అసలు బండారం బయటపడింది. అక్కడి నుండి అతడు మరో స్టోరీ వినిపించాడు.

మనోజ్ సింగ్ అనే వ్యక్తి తనని ఐపీఎస్ ఆఫీసర్‌ని చేస్తానని చెప్పి తన వద్ద రూ. 2 లక్షలు వసూలు చేశాడని.. చివరకు ఈ ఐపీఎస్ యూనిఫామ్ కూడా అతడే ఇచ్చాడు అని పోలీసులకు చెప్పాడు. మనోజ్ సింగ్‌ అడిగిన డబ్బులు ఇవ్వడం కోసం తాను తన సమీప బంధువు వద్ద రూ. 2 లక్షలు తీసుకున్నట్లు తెలిపాడు. కానీ మనోజ్ సింగ్ తనని నిజంగా ఐపీఎస్ ఆఫీసర్‌ని చేయకుండా మోసం చేశాడని పోలీసుల వద్ద వాపోయాడు. అంతేకాకుండా మనోజ్ సింగ్ అనే వ్యక్తి పేరుతో పోలీసులకు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఆ యువకుడు చెప్పిన మాటలు నమ్మిన పోలీసులు, అతడిని వదిలేసి మనోజ్ సింగ్ అనే వ్యక్తి వేటలో పడ్డారు.

మనోజ్ సింగ్‌ని వెతుక్కుంటూ వెళ్లిన తరువాతే పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆ ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ పోలీసుల నుండి తప్పించుకునేందుకు మరో ఫేక్ స్టోరీ చెప్పాడు కానీ అందులోనూ నిజం లేదని పోలీసుల విచారణలో తేలింది. ఎందుకంటే మాంఝీ ఇచ్చిన ఫోన్ నెంబర్ ప్రస్తుతానికి పనిచేయడం లేదు. పైగా అది వేరే ఇంకెవరి పేరు మీదో రిజిస్టర్ అయి ఉంది. అంతేకాకుండా అతడు చెప్పిన చోట వాళ్లకు మనోజ్ సింగ్ అనే వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. యూనిఫామ్ తీసుకోవడానికి వెళ్లానని చెప్పిన చోటుకు ఆ యువకుడు అసలు వెళ్లనేలేదు. అన్నింటికిమించి ఆ యువకుడు చెప్పినట్లుగా అతడి సమీప బంధువు అతడికి ఐపీఎస్ ఉద్యోగానికి లంచం కోసం రూ. 2 లక్షలు ఇవ్వలేదు.

ఆ యువకుడి తల్లి ఆస్పత్రి ఖర్చుల కోసం ఒకసారి రూ. 60 వేలు ఇచ్చాను. అతడి ఇంటి నిర్మాణం కోసం రూ. 45 వేలు, అలాగే వాళ్ల ఇంట్లో పెళ్లి కోసం మరోసారి రూ. 50 వేలు ఇచ్చాను. కానీ ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగం కోసం రూ. 2 లక్షలు ఇవ్వలేదు అని మితిలేష్ కుమార్ బంధువు తెలిపారు. దీంతో మితిలేష్ తనే ఐపీఎస్ ఆఫీసర్ డ్రామా ఆడుదామని వచ్చాడని.. కానీ అసలు బండారం బయటపడటంతో ఏం చేయాలో అర్థం కాక మనోజ్ సింగ్ పేరుతో మరో కొత్త డ్రామా ఆడి వెళ్లాడని పోలీసులకు అర్థమైంది. దీంతో ప్రస్తుతం మితిలేష్ నేరంపైనే దర్యాప్తు జరుపుతున్నామని జాముయి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మింటు కుమార్ సింగ్ తెలిపారు. ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్‌గా పోలీసు స్టేషన్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు.. వారికే మరో కొత్త కథ చెప్పి మరీ అక్కడి నుండి ఎలా తప్పించుకున్నాడో చూశారా!!

Tags:    

Similar News