Bharat Biotech: భారత్ బయోటెక్ ఉద్యోగుల్లో కరోనా కలవరం

Bharat Biotech: భారత్ బయోటెక్ సంస్థకు చెందిన 50 మంది ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు.

Update: 2021-05-14 02:39 GMT

Bharat Biotech:(File Image)

Bharat Biotech: దేశాన్ని కరోనా వణికిస్తోంది. చాలా మంది ఈ మహమ్మారికి గురౌతుండగా, మరి కొంత మంది బలౌతున్నారు. ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే 'కొవాగ్జిన్' టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థలో కరోనా కలకలం రేగింది. ఈ సంస్థకు చెందిన 50 మంది ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆ సంస్థ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టీకా విషయంలో రాజకీయ ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్నాయంటూ సుచిత్ర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కృషిని పట్టించుకోకుండా చేస్తున్న ఆరోపణలు తమను బాధిస్తున్నాయన్నారు.

హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోన్నభారత్ బయోటెక్ సంస్థలో పనిచేస్తోన్న సిబ్బందిలో 50 మంది కరోనా బారిన పడి విధులకు దూరంగా ఉన్నారని, అయినప్పటికీ టీకాల తయారీ కోసం శ్రమిస్తూనే ఉన్నామన్నారు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ రోజంతా టీకాల ఉత్పత్తి కొనసాగుతోందని అన్నారు. కాగా, సుచిత్ర చేసిన ఈ ట్వీట్‌కు యూజర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మీ సిబ్బందికి టీకా వేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ సరఫరా చేస్తోన్న విషయం తెలిసిందే.


Tags:    

Similar News