Bharat Bandh: నేడు భారత్ బంద్

Bharat Bandh: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి.

Update: 2021-03-26 01:06 GMT

Bharat బంద్:(ఫోటో ది హన్స్ ఇండియా)

Bharat Bandh: కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, పాండిచ్చేరిలో మాత్రం భారత్‌ బంద్‌ లేదు. దేశ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 12గంటల పాటు ఈ బంద్‌ కొనసాగుతుందని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు వెల్లడించారు. రైలు, రోడ్డు రవాణా సర్వీసులను బ్లాక్‌ చేయాలని రైతు నేతలు నిర్ణయించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ సైతం మూసివేయాలని నిర్ణయించారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్‌, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు.

మరోవైపు, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చిన ఈ 12 గంటల బంద్‌కు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌, తెదేపా, వైకాపా, సీపీఎం, సీపీఐ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో సాధారణ జనజీవనంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎస్‌కేఎం ఇచ్చిన బంద్‌ పిలుపునకు పలు రైతు సంఘాలు, కార్మిక, విద్యార్థి సంఘాలు, బార్‌ అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు తమ బంద్‌కు మద్దతు ప్రకటించాయని రైతు నేత దర్శన్‌ పాల్‌ వెల్లడించారు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నాలుగు నెలల పాటు దిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 

Tags:    

Similar News