India: రేపు భారత్ బంద్
India: చమురు ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ * బంద్‌కు పిలుపునిచ్చిన కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్
India: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధర ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సెంచరీ మార్క్‌ను దాటేసింది. ఇప్పుడు.. డీజిల్ ధరలు కూడా అదే తోవలో పోటీ పడుతుండడంతో.. వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు వాహనదారులు. ధరల పెంపుపై లారీ యజమానులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు.
చమురు ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్. బంద్‌కు 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతిచ్చాయి. జీఎస్టీ విధానాన్ని సమీక్షించాలని, కొత్త ఈ-వే బిల్లు విధానాన్ని, కొన్ని నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు ఏకరీతిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఐటీడబ్ల్యూఏ డిమాండ్ చేస్తోంది.
వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన 'చక్కా జామ్' తరహాలో రహదారుల దిగ్బంధనం చేపడతామని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ ప్రకటించింది. భారత్ బంద్‌లో దాదాపు 8 కోట్ల మంది వ్యాపారులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బంద్‌కు పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.