Bengal Elections 2021: సీఎం మమతా ఆస్తులు రూ.16.72 లక్షలేనట

Bengal Elections 2021: తనకు సొంత వాహనం కూడా లేదని, బంగారం కూడా 9 గ్రాములు మాత్రమే ఉందని సీఎం మతతా బెనర్జీ తెలిపారు.

Update: 2021-03-12 05:28 GMT

ఇమేజ్ సోర్స్:(ది హన్స్ ఇండియా)

Bengal Elections 2021: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సవాళ్లు, ప్రతి సవాళ్ళతో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బిజెపి తన వ్యూహాలకు పదును పెడుతోంది. మరో వైపు దీదీ తనదే అధికారం అంటూ సవాల్ విసురుతున్నారు. ఈ సమయంలో సీఎం మమతా బెనర్జీ ఆస్తుల వివరాలను ఈసీ కి సమర్పించారు.

తనకు సొంత వాహనం కూడా లేదని, బంగారం కూడా 9 గ్రాములు మాత్రమే ఉందని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్నారు. ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమత ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు

తన వద్ద ఉన్న నికర ఆస్తుల విలువ రూ. 16.72 లక్షలేనని అఫిడవిట్‌లో మమత పేర్కొన్నారు. 2019-20లో రూ. 10,34,370 ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే, రూ. 69,255 నగదు ఉండగా, రూ. 13.53 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన రూ. 1.51 లక్షలు కూడా అందులోనే ఉందని మమత వివరించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ)లో రూ. 18,490 పొదుపు చేశానని, 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను చెల్లించిన ఆదాయపన్నులో టీడీఎస్ రూపంలో రూ.1.85 లక్షలు వెనక్కి రావాల్సి ఉందని తెలిపారు. అలాగే, తన వద్ద 43,837 విలువైన 9 గ్రాముల బంగారం ఉందన్నారు.

కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశానని, ఎల్ఎల్‌బీ కూడా చదివానని పేర్కొన్న మమత తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగులో లేవన్నారు. మమత బరిలోకి దిగిన నందిగ్రామ్లో రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 1న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 8 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News