Elections 2021: రెండోదశ ఎన్నికలకు బెంగాల్, అసోం రాష్ట్రాలు సిద్ధం
Elections 2021: చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన ప్రచారం * బెంగాల్‌లో 30 స్థానాలకు బరిలో 171 మంది అభ్యర్థులు
Elections 2021: రెండోదశ అసెంబ్లీ ఎన్నికలకు బెంగాల్, అసోం రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. గెలుపు కోసం రెండు రాష్ట్రాల అసెంబ్లీ నియోజక వర్గాల్లో రాజకీయ పార్టీలు చివరి నిమిషం వరకు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఇక.. ప్రచార పర్వం ముగియడంతో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.
పశ్చిమ బెంగాల్, అసోంలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. ఏప్రిల్ 1న బెంగాల్‌లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కాగా రెండోదశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. మొదటి దశ పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటలను దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇక ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
బెంగాల్‌లోని దక్షిణ పరగణాలు, బంకురా, పూర్వ మెద్నీపూర్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. చెప్పాలంటే.. బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రెండోదశలోని నియోజకవర్గాలే కీలకం కానున్నాయి. అయితే ఇప్పుడు సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు పోటీ చేస్తున్న నందిగ్రామ్‌పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగించాయి.
ఇక బెంగాల్‌లో రెండోదశ పోలింగ్‌లో 30 స్థానాలకుగానూ 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 152 మంది పురుషులు కాగా.. 19 మంది మహిళలు. బెంగాల్‌లో 8 దశల్లో పోలింగ్ జరుగుతుండగా మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. అటు అసోంలో 39 స్థానాలకు గానూ ఏకంగా 345 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 26 మంది మహిళలు ఉన్నారు. ఇదిలా ఉండగా బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికల్లో మొత్తంగా 84.13శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.