New Delhi: ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్‌లతో లేజర్ షో..
Beating Retreat Ceremony 2022: ఢిల్లీ విజయ్ చౌక్‌లో బీటింగ్ రిట్రీట్ వేడుక ఘనంగా జరిగింది.
Beating Retreat Ceremony 2022: ఢిల్లీ విజయ్ చౌక్‌లో బీటింగ్ రిట్రీట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంతో లాంఛనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయ్యాయి. బీటింగ్ ది రిట్రీట్ పరేడ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఇండయన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మూడు దళాల చీఫ్‌లు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. ఆయా దళాల సైనికులు పరేడ్‌లో చేసిన ఫుట్ మార్చ్, ఫోర్సెస్ బ్యాండ్ అందరినీ ఆకట్టుకున్నాయి.
బీటింగ్ రిట్రీట్‌లో భాగంగా భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుల చిత్రాలు, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే వరకు వాళ్లు సాగించిన పోరాటం తీరు తెన్నులను లేజర్ షో రూపంలో ప్రదర్శించారు. దీంతో పాటు వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లతో జాతీయ జెండా రంగుల్లో ఇండియా మ్యాప్, 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని గుర్తు చేస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హిందీ అక్షరాలు, మేకిన్ ఇండియా లోగో, గాంధీ చిత్రం సహా స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన పలు సన్నివేశాలను ప్రదర్శించారు. ఈ డ్రోన్, లేజర్ షో ఈ ఏడాది బీటింగ్ రిట్రీట్ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.