లుథియానా కోర్టులో పేలుడు ఘటనలో మృతుడి గుర్తింపు.. పచ్చబొట్టు, సెల్‌ఫోన్ ఆధారంగా...
Ludhiana Blast: మాజీ హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా నిర్ధారణ...
Ludhiana Blast: సంచలనం సృష్టించిన పంజాబ్‌లోని లుథియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాంపై ఉన్న పచ్చబొట్టు, లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా అతడిని మాజీ హెడ్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. ఈ కేసులో అనుమానితుడైన ఆ కానిస్టేబుల్ గతంలో మాదకద్రవ్యాలను తరలిస్తూ పట్టుబడ్డాడు. 2019లో అతడిని విధుల నుంచి తొలగించినట్టు పోలీసులు తెలిపారు.
ఆగస్టు 2019లో గగన్‌దీప్ సింగ్ అరెస్ట్ అయ్యాడని, రెండేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించినట్టు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరులో బెయిలుపై జైలు నుంచి విడుదలైనట్టు వివరించారు. శుక్రవారం ఈ కేసు విచారణకు రావాల్సి ఉండగా ముందురోజే అతడు కోర్టుకు ఎందుకు వచ్చాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు దీని వెనుక ఉగ్రవాద సంస్థ బబర్ ఖస్లా హస్తం ఉండొచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారమిచ్చాయి. స్థానిక గ్యాంగ్ స్టర్ అయిన హర్వీందర్ సింగ్ సాయంతో ఈ ముఠా పేలుడుకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.