Car Submerged in Floods: రోడ్లపై భారీ వరదలు, అండర్‌పాస్ కింద కారు నీళ్లలో మునిగి బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ మృతి

Update: 2024-09-14 14:20 GMT

Car Submerged in Floods: ఇటీవల దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కురిసిన భారీ వర్షాలతో అక్కడి రోడ్లు వరద కాలువలను తలపించాయి. అలా ఢిల్లీని ఆనుకుని ఉన్న ఫరీదాబాద్‌లో ఓ అండర్‌పాస్ రోడ్డుపై చేరిన వరద నీటిలో ఓ కారు చిక్కుకుని అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు చనిపోయిన ఘటన ఇది. చనిపోయిన వారిలో ఒకరు గురుగ్రామ్ సెక్టార్ 31 లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మేనేజర్ పుణ్యశ్రేయ శర్మ కాగా మరొకరిని అదే బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తోన్న విరాజ్ ద్వేదిగా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. పుణ్యేశ్రేయ శర్మ, విరాజ్ ద్వివేది ఇద్దరూ శుక్రవారం సాయంత్రం బ్యాంకులో పని ముగించుకుని ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు. గురువారం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్పటికే రోడ్లన్నీ వరద కాలువల్లా తయారయ్యాయి. ఎలాగోలా ఫరీదాబాద్ వరకు చేరుకున్నారు. అక్కడ ఫరీదాబాద్ రైల్వే వంతెన కింద నుండి వెళ్లే రహదారిలోకి ప్రవేశించారు. అక్కడ నీళ్లు నిలబడి ఉండటం చూశారు కానీ అవి ఎంత ఎత్తులో ఉన్నాయని అంచనా వేయలేకపోయారు. ఎప్పటిలాగే అందులోంచి వెళ్లిపోతాం అని తమ మహింద్రా ఎస్‌యూవి 700 కారుని ముందుకు పోనిచ్చారు. కానీ తీరా మధ్యలోకి వెళ్లాకే తెలిసింది కారు అందులో దాదాపు మునిగిపోతుంది అని. అప్పటికే కారులోపలికి పూర్తిగా నీళ్లు వచ్చేశాయి. అందులోంచి బయటపడేందుకు వాళ్లు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకునేటప్పటికే ఆలస్యమైపోయింది. ఇద్దరూ అదే నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అతి కష్టంమీద బ్యాంక్ మేనేజర్ పుణ్యేంద్ర శర్మ మృతదేహాన్ని వెలికితీశారు. విరాజ్ ఆచూకీ కోసం గంటల తరబడి గాలించిన అనంతరం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అతడి మృతదేహం లభించింది. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు, నీరు నిలిచిన మార్గాలగుండా వాహనాలు డ్రైవ్ చేయడం ఎంత ప్రమాదమో ఈ ఘటన మరొకసారి నిరూపించింది.

ఈ వీడియో చూడండి: కారు నీట మునిగితే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆల్ రౌండ్ సేఫ్టీ ఉంటుంది?

Tags:    

Similar News