నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు.. ఉత్కంఠగా దేశం..
28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడనుంది. ఈ కేసులో సుమారు 351 మంది సాక్షులు..
28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడనుంది. ఈ కేసులో సుమారు 351 మంది సాక్షులు మరియు దాదాపు 600 డాక్యుమెంటరీ ఆధారాలను సిబిఐ కోర్టు ముందు సమర్పించింది. దీంతో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, ఉమాభారతి ల భవితవ్యం తేలనుంది. మరికొన్ని గంటల్లో తీర్పు రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో కోర్టు ఏమి చెబుతుందా అని ఆసక్తితో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కటియార్లతో సహా 49 మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి.
వీరిలో బాలాసాహెబ్ థాకరే, పరమహంస రామచంద్ర దాస్, వినోద్ కుమార్ వత్స్, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, రాంనారాయణ్ దాస్ తదితర 17 మంది నిందితులు మరణించారు. తీర్పు నేపథ్యంలో నిందితులందరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే చంపత్ రాయ్, బ్రిజ్భూషణ్ సింగ్, పవన్ పాండే లల్లూ సింగ్, సాక్షి మహారాజ్, సాధ్వీ రితంబర్, ఆచార్య ధర్మేంద్ర దేవ్, రామ్‌చంద్ర ఖత్రి, సుధీర్ కక్కర్, ఓపి పాండే, జయ భగవ , అమర్‌నాథ్ గోయల్ మరియు సంతోష్ దుబే లు కోర్టుకు హాజరుకావాలని భావిస్తున్నారు. కాగా సెప్టెంబర్ 30 లోగా విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించాలని కోరిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుంది. 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదును "కర్ సేవకులు" పడగొట్టిన విషయం తెలిసిందే.