130th Ambedkar Jayanti: నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు
130th Dr BR Ambedkar Jayanti: అణగారిన జీవితాల్లో అక్షర దారి నింపిన మహనీయుడు డా.బి.ఆర్. అంబేద్కర్
130th Dr BR Ambedkar Jayanti: అణగారిన జీవితాల్లో అక్షర దారి నింపిన మహనీయుడు డా.బి.ఆర్.అంబేద్కర్. ఆధునిక భారత దేశ చరిత్రను ప్రభావితం చేసిన మహనీయుల్లో అగ్రగామి. స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారత రాజ్యంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు, స్వాతంత్రోద్యమ నేత, గొప్ప దేశ భక్తుడు, న్యాయవాది, సామాజిక శాస్త్రవేత, చరిత్రకారుడు రచయిత ఇలా ఎన్ని చెప్పినా తక్కవేనేమో.
అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం. అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్. భారతదేశ ప్రజల్లో సమానత్వం కోసం అహర్నిశలు తపించిన కృషీవలుడు అంబేద్కర్. బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాల నుంచి దేశమంతా స్వేచ్చావాయువుల కోసం తపిస్తోన్న స్వాతంత్య్రోద్యమ కాలంలో బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన ధీశాలి. ఆ మహనీయుని 130వ జయంతిని ఇవాళ దేశం మొత్తం జరుపుకుంటోంది.
1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబవాడేలో (అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన 'మౌ'అన్న ఊరిలో) తల్లిదండ్రులు… రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ జన్మించారు. పూర్తి పేరు భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్. చదువుకోవాలన్నా…మంచినీళ్ళు తాగాలన్నాకులమే అడ్డుగా నిలబడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సమాజంలో వర్ణ, వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు.
మహాత్మాగాంధీ నేతృత్వంలో సాగిన భారతస్వాతంత్య్ర ఉద్యమానికి సమాంతరంగా, దేశంలో సామాజిక అణచివేతను సవాలు చేసిన వాళ్లలో అంబేద్కర్ ప్రముఖంగా వినిపిస్తారు. సామాజిక రంగంపై అంబేద్కర్ చూపిన బలమైన ముద్ర భారతదేశ రాజ్యాంగ రచనా సమయంలో పౌరులందరి సామాజిక, రాజకీయ సమానత్వం పట్ల విస్తృతమైన ఆమోదానికి వీలు కల్పించింది. ఫలితంగా సామాజిక చట్రంలో ఆచారాల కింద నలిగిపోయిన వారిని ఉద్ధరించే రీతిలో భారత రాజ్యాంగ రూపకల్పన జరిగింది. బ్రిటిషర్ల పాలనా కాలంలో దేశ పౌరులందరికీ ఓటు ఉండేది కాదు. పన్ను చెల్లింపుదారులు, విద్యావంతులు మాత్రమే ఓటు వేసేవారు. ఆ తర్వాత నెహ్రూ సాయంతో అంబేద్కర్ రాజ్యాంగంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కును ముందుకు తీసుకొచ్చారు. ఈ భావన తర్వాత పార్లమెంటులో గిరిజన ప్రాతినిధ్య హక్కుల పరికల్పనకు కూడా వీలు కల్పించింది.
పంచాయతీలు, పురపాలక సంస్థల్లో కూడా దళితులకు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్య హక్కులు లభించాయి. 1932 సెప్టెంబర్‌లో పూనా ఒడంబడికపై సంతకం చేయడం ద్వారా గాంధీ ప్రాణాలను కాపాడటంలో అంబేద్కర్ నిర్వహించిన పాత్రతో విశిష్టమైందని కూడా చెబుతుంటారు. పూనా ఒడంబడిక తర్వాతే గాంధీ దళితులకు దేవాలయ ప్రవేశంపై ఉద్యమం ప్రారంభించారు. ఇలా 1950లో భారత రాజ్యాంగంలో ఈ హక్కులన్నింటినీ పొందుపర్చడానికి అంబేద్కర్ కృషి ఎంతో దోహదపడింది.
కుల నిర్మూలన ద్వారానే సమ సమాజ నిర్మాణం సాధ్యమని అంబేద్కర్ చెప్పేవారు. దురదృష్టవశాత్తు కులాల పేరిట ఉద్యమాలు కుంపట్లుగా మారి దేశ సమ్రగత, సామరస్యానికి విఘాతం కలిగించేవిగా మారాయి. అవి అగ్రవర్ణాలవి కావచ్చు... బడుగు బలహీన వర్గాలవి కావచ్చు. ఈ రోజు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారు. కానీ ఆయనను అర్థం చేసుకున్న వారు, విధానాలను అనుసరిస్తున్న వారు చాలా అరుదు. ముందు మనం తక్షణం చేయాల్సిన పని ఇదేనేమో.