Ayodhya Deepotsav: అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం
Ayodhya Deepotsav: దీపాలతో కోలాహలంగా సరయూ నదీతీరం
Ayodhya Deepotsav: ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి పండుగ సందడి మొదలైంది. ఇప్పటికే రామ మందిర నిర్మాణంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అయోధ్య...ఇప్పుడు పండుగ సందర్భంగా మరింత అందంగా ముస్తాబైంది. అంతే కాదు. గిన్నిస్ వరల్డ్ రికార్డుకీ సిద్ధమవుతోంది. దీపోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 51 ఘాట్స్‌లో 24 లక్షల దీపాలను వెలిగించనున్నారు. అయితే ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 24 లక్షల దీపాలను వెలిగించేందుకు 25 వేల మంది వాలంటీర్లు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టీమ్ కూడా వస్తుంది. డ్రోన్ కెమెరా ద్వారా దీపాలను లెక్కించనుంది. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు పాల్గొననున్నారు.
ఈరోజు రాత్రి పవిత్ర అయోధ్య నగరంలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం సరయు నదీ తీరం వెంట వైభవంగా దీపోత్సవం, లేజర్ షో నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు చేశారు. సరయూ నదీ తీరంలోని 51 ఘాట్‌ల వద్ద 24 లక్షల దీపాలు ఏర్పాటు చేశారు. ఈ దీపోత్సవానికి రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ భారీ ఏర్పాట్లు చేసింది. 24 లక్షల మట్టి దీపాలతో రంగవల్లులు, పూలతో గిన్నిస్ రికార్డు నెలకొల్పేలా దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి ప్రత్యేకంగా జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాకు చెందిన గిరిజనులతో సహా వివిధ ప్రాంతాల ప్రజలు ఈ దీపోత్సవాన్ని వీక్షించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో జార్ఖండ్ గిరిజనులు దీపాలు వెలిగించనున్నారు.
ఇప్పటికే కొందరు అయోధ్యకు తరలి వచ్చారు. దీపోత్సవం తరవాత లేజర్ షో జరగనుంది. దీన్ని కూడా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి సహా మంత్రులు వస్తుండడం వల్ల భద్రతపై దృష్టి పెట్టారు పోలీసులు. అయోధ్యను మొత్తంగా 14 పోలీస్ జోన్స్‌గా విభజించారు. AI సాయంతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా సీసీ కెమెరాలు పెట్టారు. ప్రతి కదలిక కూడా రికార్డ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతేడాది అయోధ్యలోని సరయు నదీ తీరంలో 15 లక్షల దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో 20 వేల వాలంటీర్లు పాల్గొన్నారు. అది కూడా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించింది
నేటి దీపోత్సవంలో పాల్గొనడానికి జార్ఖండ్ గిరిజనులు అయోధ్యకు చేరుకున్నారు. రామ మందిర నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈసారి యూపీతో పాటు పలు రాష్ట్రాల సంస్కృతులను ప్రదర్శనల్లో చూపనున్నారు. ఇప్పటికే అయోధ్యానగరి దీప కాంతులతో మెరిసిపోతోంది. రోడ్లు, ఇళ్లు, వీధులు జనాలతో రద్దీగా మారిపోయాయి. కాగా అయోధ్యలో జనవరి 22న రామాలయంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.