Tamil Nadu: నేటితో ఎన్నికల ప్రచారానికి తెర
Tamil Nadu: ఈ నెల 6న జరిగే పోలింగ్‌కు సర్వం సిద్ధం * ఎన్నికల కోసం లక్షా 55వేల 102 ఈవీఎంలు రెడీ
Tamil Nadu: తమిళనాడులో శాసనసభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. రాత్రి 7 గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఈ నెల 6న పోలింగ్ నిర్వహించనున్నారు. ఒకే విడుతలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల కోసం మొత్తం లక్షా 55వేల 102 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 80 ఏండ్లు పైబడినవారికి పోస్టల్ ఓట్లు వేసేలా అవకాశం కల్పించారు. దీనికోసం 2.44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఎన్నికల బరిలో అన్నాడీఎంకే, డీఎంకే, కమల్‌హాసన్, దినకరన్ పార్టీలతోపాటు పలు రాజకీయ పక్షాలు పోటీలో ఉన్నాయి. అయితే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నది. ఇరుపక్షాలకు చెందిన రాష్ట్ర, జాతీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్‌గాంధీ తమ కూటముల పక్షాన ప్రచారం నిర్వహించారు.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం గడువు మే 24తో ముగినయుంది. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమిలో బీజేపీ తదితర పక్షాలు ఉండగా, డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 25 స్థానాల్లో పోటీచేస్తున్నాయి.