Assam Floods: అసోంలో వరదల బీభత్సం
Assam Floods: దేశంలో ఓ వైపు కరోనా .. మరో వైపు వరద భారతం.. లక్షలాది మంది దుర్బర జీవితం.. అందుకు ఉదాహరణనే అసోం.. గత కొద్ది రోజులుగా కుండపోతగా వర్షాల వల్ల బ్రహ్మ పుత్ర, దాని ఉపనదులు మహోగ్ర రూపం దాల్చయి
Assam floods: దేశంలో ఓ వైపు కరోనా .. మరో వైపు వరద భారతం.. లక్షలాది మంది దుర్బర జీవితం.. అందుకు ఉదాహరణనే అసోం.. గత కొద్ది రోజులుగా కుండపోతగా వర్షాల వల్ల బ్రహ్మ పుత్ర, దాని ఉపనదులు మహోగ్ర రూపం దాల్చయి. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో రాష్ట్రం అతలాకుతల మవుతున్నది. ఆ జల విలయానికి దాదాపు 50 రోజులుగా నీటిలో జీవనం సాగిస్తున్నారు అస్సామీలు. ఇండ్లు, రోడ్లు , వంతెనలు కొట్టుకుపోయాయి.
వరదల ఉద్ధృతి మొత్తం 30 జిల్లాల్లోని 54 లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ 107 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మొత్తం 26 జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. 2,700 గ్రామాల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల ధాటికి ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 50వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. బ్రహ్మపుత్రా నదికి వరద పోటెత్తడంతో కజిరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 80 శాతం నీట మునిగింది. దీంతో మూగజీవాలు భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. వరద నీరు చుట్టుముట్టడంతో వన్యప్రాణులు జాతీయ రహదారిపైకి వచ్చి ప్రాణాలు నిలుపుకుంటున్నాయి. 150పైగా జంతువులు చనిపోయాయి.
కాగా, ముఖ్యమంత్రి శర్వానంద్ సోనావాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి, అసోంలో వరదల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత గురించి ఆరా తీశారు. వరదల ప్రభావానికి గురయిన ప్రజలకు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు దాదాపు లక్ష క్వింటాళ్ల బియ్యం, 19,397 క్వింటాళ్ల కందిపప్పు, 173,006 లీటర్ల వంట నూనె అందజేసినట్టు అధికారులు తెలిపారు.