Ayodhya: అయోధ్య రామాలయం రెడీ
Ayodhya: ప్రారంభోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు.. ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ
Ayodhya: దేశప్రజలకు 2024 జనవరి 22 ప్రత్యేకమైన రోజుగా మారనుంది. అయోధ్య రామమందిర దర్శనం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది హిందువులకు శుభవార్త అందింది. రామాలయ ప్రారంభోత్సవ వేడుక ,ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు.
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గోనాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ వస్తున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితో పాటు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. అయితే రామ్ లల్లాను ఐదేళ్ల బాలుడి రూపంలో ఆలయంలో కూర్చోబెడతారు.. ఇందుకోసం కర్ణాటక, రాజస్థాన్‌ల నుంచి తీసుకొచ్చిన శిలలతో మూడు విగ్రహాలను తయారుచేశారు. ఈ విగ్రహాలు దాదాపుగా సిద్ధమయ్యాయి.
ఈ ఆలయంలో గర్భగుడితో పాటు ఐదు మండపాలు ఉంటాయి. ఇక జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్న సందర్భంగా.. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.