భారత్ లో యాపిల్, శామ్‌సంగ్‌తో సహా పలు కంపెనీల మొబైల్ ఫోన్‌ల తయారీకి అనుమతి
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పిఎల్‌ఐ) పథకం కింద దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి 16 నూతన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది..
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పిఎల్‌ఐ) పథకం కింద దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి 16 నూతన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా అర్హత ఉన్న 16 మంది దరఖాస్తులను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) ఆమోదించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఆమోదం పొందిన ఈ సంస్థలు మొబైల్ ఫోన్‌ల తయారీకి అదనంగా రూ .11 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. పిఎల్‌ఐ పథకం కింద కంపెనీలు వచ్చే 5 సంవత్సరాలలో సుమారు 10.5 లక్షల కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్‌లను తయారు చేస్తాయని కేంద్రం తెలిపింది.
కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్ కాన్, హన్ హై, విస్ట్రాన్ మరియు అంతర్జాతీయ సంస్థలైన ఆపిల్ ప్రతిపాదనలు కూడా వీటిలో ఉన్నాయి. ఇది కాకుండా, శాంసంగ్ వంటి రైజింగ్ స్టార్ కంపెనీ ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పిఎల్‌ఐ పథకం కింద వచ్చే ఐదేళ్లలో కంపెనీలు.. 2 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పిస్తాయని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.
కాగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించింది. దానిపేరే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పిఎల్‌ఐ).. ఏప్రిల్ 1 నుండి ఈ పథకం ప్రారంభం అయింది, ఈ పథకంలో భాగంగా భారతదేశంలో మొబైల్ తయారు చేస్తే ఐదేళ్లపాటు 4% నుండి 6% వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా, మిలియన్ల కోట్ల పెట్టుబడులు భారతదేశానికి వస్తాయని, ఇది మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ప్రయోజనానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.