కోల్‌కతా హత్యాచార ఘటనలో మరో ట్విస్ట్.. నిందితుడు సంజయ్ రాయ్‌కి నార్కో పరీక్ష..?
నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమైన సీబీఐ
Kolkata Doctor Rape-Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనలో దర్యాప్తు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహించాలని సీబీఐ భావిస్తోంది. ఇందుకు అనుమతి కోరుతూ సెల్దా కోర్టులో ఇప్పటికే సీబీఐ అభ్యర్థన దాఖలు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి ఇప్పటికే పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించిన అధికారులు లై-డిటెక్టర్ పరీక్ష వివరాలను గోప్యంగా ఉంచారు.
అయితే, అందులో సంజయ్ తాను ఏ తప్పు చేయలేదని తాను వెళ్లేసరికే ఆ వైద్యురాలు చనిపోయి ఉందని, తాను భయంతో పారిపోయానని అతడు చెప్పినట్లు వార్తలు బయటికి వచ్చాయి. దీంతో నిజనిర్ధారణ కోసం అతడికి నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ భావిస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. నిందితుడికి నార్కో పరీక్షలు చేసేందుకు మేజిస్ట్రేట్ అనుమతిని సీబీఐ కోరినట్టు తెలుస్తుంది. అయితే, నార్కో అనాలసిస్‌లో వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా కోర్టులు పరిగణించవు. కానీ, కేసు దర్యాప్తునకు ఇవి కీలకంగా మారనున్నాయి.