Online Marriage: పెళ్లికి సెలవు ఇవ్వని బాస్.. ఆన్‌లైన్ లో పెళ్లి చేసుకున్న వధూవరులు..
Online Marriage: సెలవు దొరక్కపోవడంతో ఓ యువకుడు ఆన్ లైన్ లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Online Marriage: సెలవు దొరక్కపోవడంతో ఓ యువకుడు ఆన్ లైన్ లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి చేసుకుని వస్తానని ఓ యువకుడు సెలవు అడిగితే బాస్ తిరస్కరించాడు. మరోపక్క అనారోగ్యంతో ఉన్న పెళ్లి కూతురు తాతయ్య త్వరగా వివాహం చేసుకోవాలంటూ పట్టుబడ్డాడు. ఇక తప్పనిసరి పరిస్థితిలో యువకుడు ఆన్ లైన్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తుర్కియేలో ఉద్యోగం చేస్తున్న అద్నాన్ మహ్మద్ అనే యువకుడు, హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో ఉన్న వధువుని వర్చువల్ గా వివాహం చేసుకున్నాడు.
కార్పొరేట్ సంస్థల్లో పని ఒత్తిడి ఎక్కువ అవుతోంది. ఆఫీసుల్లో పని ఒత్తిడి ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. అత్యవసర సమయాల్లో కూడా లీవ్ లు ఇవ్వని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎంత పెద్ద ఉద్యోగం అయినా జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ ఇంపార్టెంట్.. కానీ అలాంటి సమయంలో కూడా మహ్మద్ కు బాస్ సెలవు ఇవ్వలేదు. బిలాస్ పూర్ కు చెందిన మహ్మద్ తుర్కియేలో ఉద్యోగం చేస్తుంటాడు. ఇటీవల అతడికి మండీకి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే అనారోగ్యంతో ఉన్న పెళ్లి కూతురు తాతయ్య.. ఆమె పెళ్లి చూడాలని ఎంతగానో ఆశపడ్డాడు. త్వరగా వివాహం చేసుకోవాలంటూ పట్టుబట్టాడు.
ఈ క్రమంలో ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకునేందుకు వరుడు నిశ్చయించుకున్నాడు. కానీ తన కంపెనీలో సెలవుకు దరఖాస్తు చేసుకుంటే లీవ్ ఇచ్చేలేదని తేల్చి చెప్పాడు బాస్. దీంతో ఏం చేయాలో అర్థం కాని వరుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఇరుకుటుంబ సభ్యులు చివరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్లి జరిపించేందుకు నిర్ణయించాయి. ఆదివారం మహ్మద్ కుటుంబ సభ్యులు బిలాస్ పూర్ నుంచి ఊరేగింపుగా మండీలోని వధువు ఇంటికి వెళ్లారు. వరుడు లేకపోయినా సరే సాంప్రదాయబద్దంగా ఊరేగింపుగా వచ్చారు. ఆ తర్వాత వీడియో కాలింగ్ ద్వారా ఓ ఖాజీ ఈ పెళ్లి జరిపించారు. ఆచారం ప్రకారం వధువరులతో ఖుబూల్ హై అని మూడు సార్లు చెప్పించారు. దీంతో పెళ్లి జరిగిపోయింది.
హిమాచల్ ప్రదేశ్ లో గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు వెలుగు చూశాయి. గతేడాది వరదల కారణంగా మార్గం మూసుకుపోవడంతో ఓ జంట ఆన్ లైన్ లోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.