Amit Shah Tour: మూడు రోజుల పాటు జమ్ముకాశ్మీర్‌లో అమిత్ షా టూర్
*అమిత్ షా అధ్యక్షతన యునిఫైడ్ కమాండ్ సమావేశం *జమ్ముకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై సమీక్ష
Amit Shah Tour: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు. 2019 ఆగస్టు 5వ తేదీన జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో అమిత్‌షా తొలిసారి పర్యటించనున్నారు. గుప్కర్ రోడ్డులోని రాజ్‌భవన్‌లో అమిత్ షా బస చేస్తారు. రాజ్‌భవన్ నుంచి కశ్మీర్ లోయలో 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
స్థానికేతరులు, మైనారిటీలపై ఇటీవలి దాడుల నేపథ్యంలో కశ్మీర్ లోయను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కీలక ప్రాంతాల్లో స్నిప్పర్స్, షార్ప్ షూటర్లను నియోగించారు. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఉగ్రవాద దాడులను నియంత్రించేందుకు శ్రీనగర్‌లోని సిటీ సెంటర్ నుంచి లాల్ చౌక్ వరకు గగనతలంపైనా నిఘా పెట్టాయి. ప్రజల్లో అనుమానాస్పద కదలికలను కనిపెట్టడానికి శ్రీనగర్ అంతటా డ్రోన్లతో పర్యవేక్షిస్తారు. డాల్ లేక్, జీలం నదుల్లో మోటారు బోట్లను సీఆర్పీఎఫ్ బలగాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.
ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు శ్రీనగర్ అంతటా భద్రతా అధికారులు మఫ్టీలో విధులు నిర్వహిస్తారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు, పాదచారుల తనిఖీలు చేపట్టారు. ప్రజలను వేధించడం కోసం కాదని, వారి భద్రత దృష్టిలో పెట్టుకునే సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఢిల్లీ నుంచి వచ్చిన 10 సీఆర్పీఎఫ్ కంపెనీలు, 15 బీఎస్ఎఫ్ టీమ్స్ శ్రీనగర్‌లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్నాయి.
హోంమంత్రి అమిత్‌షా తన పర్యటనలో ఇవాళ శ్రీనగర్-షార్జా మధ్య విమాన సర్వీసును ప్రారంభిస్తారని తెలుస్తోంది. అలాగే ఇటీవల జరిగిన దాడుల్లో మరణించిన పౌరుల కుటుంబాలతోనూ అమిత్‌షా సమావేశం అవుతారని సమాచారం. ఆయన అధ్యక్షతన జరిగే యునిఫైడ్ కమాండ్ సమావేశంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై సమీక్షిస్తారని సమాచారం. ఆదివారం జమ్ములో జన్ సంవాద్ అనే పేరుతో జరిగే బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడాతారని తెలుస్తోంది.