Karnataka: కర్ణాటకలో పొలిటికల్ హీట్
Karnataka: బెంగళూరుకు వచ్చిన అమిత్ షా
Karnataka: కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్లు, కాంట్రక్టర్ ఆత్మహత్య వంటి వివాదాలు కర్ణాటకను కుదిపేశాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సీఎం బసవరాజు బొమ్మై ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తే పార్టీకి నష్టం జరగొచ్చని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రిని మార్చబోతున్నారంటూ జోరుగా ప్రచారమవుతోంది. తాజాగా ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగళూరుకు రానుండడంతో అందుకు మరింత బలం చేకూరింది. 'ఖేలో ఇండియా' ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు అమిత్‌షా బెంగళూరుకు రావడంతో కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ప్రతిపాదిస్తారా? లేక ముఖ్యమంత్రి మార్పుపై పార్టీ నాయకులతో మాట్లాడుతారా? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
అమిత్‌షా బెంగళూరు పర్యటనతో ఇప్పుడు బీజేపీ జాతీయ వ్యవహారాల కార్యదర్శి బీఎల్ సంతోష్ ఇటీవల చేసిన వ్యాఖ‌్యలు తెరపైకి వచ్చాయి. రాష్ట్ర నాయకత్వంపై నిర్ణయాలు తీసుకునే అధికారం బీజేపీ అధిష్ఠానానికి ఉందని సంతోష్ అన్నారు. గుజరాత్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులను మార్చినట్టే కర్ణాటకలోనూ మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని సంతోష్ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కడానికి సంతోష్ వ్యాఖ్యల నేపథ్యంలో అమిత్‌షా బెంగళూరుకు రావడమే కారణం. అయితే కర్ణాటక నాయకత్వ మార్పుపై మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం లేదని బొమ్మై అద్భుతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. రాజకీయ స్థితిగతులను తెలుసుకునేందుకే అమిత్ షా వస్తున్నట్టు యడ్యూరప్ప తెలిపారు.
కాగా కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా యడియూరప్ప ముఖ్యమంత్రి పదవిని చేపట్టగా కొంతకాలానికే ఆయను తొలగించి బసవరాజ్ బొమ్మైని సీఎంగా అధిష్టానం నిర్ణయించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలలు అవుతోంది. త్వరలోనే బొమ్మై తన కేబినెట్‌ను త్వరలో విస్తరించాలని భావిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా బెంగళూరు రావడంతో పార్టీ నాయకత్వ మార్పు గురించి చర్చిస్తారనే ప్రచారం ఊపందుకుంది.