దేశంలో పలు సమస్యలపై చర్చించే వేదికలు కుచించుకుపోతున్నాయని... నోబెల్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దతు పలికిన ఆయన.. చట్టాలను సమీక్షించాల్సిన అవసరాన్ని తాజా నిరసనలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఐతే అంతకుముందు నిరసన చేస్తున్న రైతులతో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వానికి సూచించారు. ఇక ఏకపక్షంగా విధిస్తోన్న దేశద్రోహ ఆరోపణలను ఎదుర్కొనే వారు... సరైన విచారణ లేకుండానే జైలుపాలు అవుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయిప్పడు !
అమర్త్యసేన్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అవి నిరాధారమైనవి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పష్టంచేశారు. అసహనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే బెంగాల్ వచ్చి చూడాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యయుతంగా చేసుకునే కార్యక్రమాలకు ఇక్కడి ప్రభుత్వం ఎలా అడ్డుతగులుతుందో తెలుసుకోవాలని అన్నారు. ఇక అమర్త్యసేన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వర్జియా... రైతులతో చర్చలు జరిపేందుకు ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని స్పష్టంచేశారు.