All Party Meeting: ముగిసిన అఖిలపక్ష సమావేశం
All Party Meeting: సమావేశంలో పాల్గొన్న 36 పార్టీలు
All Party Meeting: పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 36 పార్టీలు పాల్గొన్నాయి. సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న క్రమంలో కనీస మద్దతు ధర చట్టాన్ని తేవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే, రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. ఈ క్రమంలో విపక్షాల సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఇదే సమయంలో సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
అఖిలపక్ష భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలవరం సహా పలు సమస్యలపై చర్చించినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు 55వేల కోట్ల పెండింగ్ నిధులు ఇవ్వాలని కోరామన్నారు. అలాగే, ఇటీవల వరదలకు గురైనా జిల్లాలకు వెయ్యి కోట్లు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దనే అంశాన్ని ప్రస్తావించామన్నారు. అటు చంద్రబాబు ఎపిసోడ్‌పై స్పందించిన విజయసాయి సింపతీ కోసమే చంద్రబాబు డ్రామాలని ఎద్దేవా చేశారు.
మరోవైపు.. అఖిలపక్ష సమావేశానికి టీఆర్‌ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు, వైసీపీ పక్షాన విజయసాయి రెడ్డి, టీడీపీ తరపున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ కనకమేడల ఏపీ ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. ఏపీ ఆర్థికంగా దివాళా తీసిందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలని భేటీలో కోరినట్లు పేర్కొన్నారు. అలాగే, టీడీపీ అధ్యక్షుడి కుటుంబంపై అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను కూడా సభలో ప్రస్తావిస్తామన్నారు.
ఇక టీఆర్ఎస్ నుంచి అఖిలపక్షానికి హాజరైనా నామా నాగేశ్వరరావు బీజేపీ ప్రభుత్వం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. పార్లమెంట్ వింటర్ సెషన్స్‌లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశామన్నారు. తెలంగాణ మొత్తం పంట కొనాలని ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. యాసంగి పంట కొనుగోళ్ల అంశంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.