ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సీఈసీ సుశీల్ చంద్ర కీలక ప్రకటన
Sushil Chandra: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల భవితవ్యమేంటీ?
Sushil Chandra: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల భవితవ్యమేంటీ? ఎన్నికలను అనుకున్న షెడ్యూల్‌కే నిర్వహిస్తారా? లేదంటే వాయిదా వేస్తారా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించాలని అన్ని రాజకీయ పార్టీలు కోరాయని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. అయితే పోలింగ్ సమయంలో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా బూత్‌ల సంఖ్య పెంచనున్నట్లు తెలిపింది.
అన్ని పార్టీలూ ఎన్నికలకే మొగ్గు చూపాయని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికలకు సంబంధించి కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలంటూ అన్ని రాజకీయ పార్టీలూ కోరాయన్నారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 5న విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల పోలింగ్‌కు సంబంధించి లక్ష పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.