AIIMS Services: రాష్ట్రాలకు ఎయిమ్స్ సేవలు.. వారంలో రెండు రోజుల పాటు కన్సల్టేషన్
AIIMS Services:ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించలేకపోతున్నారు.
AIIMS Services:ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించలేకపోతున్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రమో అని కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీనికి సంబంధించి రోగులకు సోకిన వైరస్ తీరు, వారికి అందిస్తున్న వైద్య సేవలు తదితర వివరాలను తెలుసుకుని, సంబంధిత వైద్యులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గాను భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగాను ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (ఢిల్లీ) ఎయిమ్స్ వైద్యులతో వారానికి రెండు రోజులు ఈ కన్సేల్టేషన్ఇ చ్చేందుకు ఆదేశాలు జారీచేసింది. ఏపీకి సంబంధించి మంగళ, శుక్రవారాల్లో ఈ సదుపాయం కల్పించింది.ఈ అవకాశాన్ని వినియోగించుకుని, మెరుగైన వైద్యం అందించి, వైరస్ వ్యాప్తిని మరింత తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ మరణాలను నియంత్రించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యుల సేవలు వినియోగించాలని నిర్ణయించింది. వీరు ప్రతి రాష్ట్రంలోనూ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా వ్యవహరించేలా స్థానిక యంత్రాంగానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న స్పెషల్ కోవిడ్ ఆస్పత్రులను ప్రతి మంగళవారం, శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తారు.
► ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్ణయించిన ఆస్పత్రుల్లో వీడియో కన్సల్టేషన్ నిర్వహణ.
► ప్రధానంగా క్రిటికల్ కేర్‌లో ఉన్న రోగుల పరిస్థితులపై అధ్యయనం.
► వీరికి ఎలాంటి మందులు ఇస్తున్నారు, వారిని మృత్యువాత పడకుండా ఎలా కాపాడాలన్నదానిపై సలహాలు, సూచనలు.
► కోవిడ్ రోగుల కేస్ షీట్‌ల పరిశీలన.
► క్రిటికల్ కేర్‌కు సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలనేదానిపై స్థానిక వైద్యులకు సూచనలు.