AIIMS Dr. Randeep Guleria: రెండో డోసు ఆలస్యమైనా కంగారుపడొద్దు..

Dr. Randeep Guleria: ఆలస్యమైనా రెండో డోసు తీసుకుంటే బూస్టర్ ఎఫెక్ట్ ఇస్తుందని చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు

Update: 2021-05-01 05:47 GMT

రణదీప్ గిలేరియా (ఫైల్ ఇమేజ్)

Dr. Randeep Guleria: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవడం కాస్త ఆలస్యమైతే పనిచేయదన్న కంగారుపడొద్దని, ఆలస్యమైనా రెండో డోసు తీసుకుంటే బూస్టర్ ఎఫెక్ట్ ఇస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు. ఆలస్యమైనంత మాత్రాన రెండో డోసు వేసుకోవడానికి జంకవద్దని, ఆలస్యమైనా అది పనిచేస్తుందన్నారు. కరోనా బారినపడి కోలుకున్న వారు రెండు వారాల తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర మార్గదర్శకాలు చెబుతుండగా, వైద్య నిపుణులు మాత్రం లక్షణాలన్నీ తగ్గిన తర్వాత 4-6 వారాల్లో తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ గులేరియా ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో వైద్య వసతులపై ఒత్తడి పెరిగింది. ఒకరోగి ఆక్సిజన్ కోసం ఆసుపత్రిలో చేరితే పది రోజుల వరకు అక్కడే ఉండాలి. కానీ బయట పడకల కోసం నిరీక్షిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది.

కొందరిలో వైరస్ ఊపిరితిత్తుల్లో ఎక్కవగా వ్యాపిస్తోంది. అలాంటి వారిని రెండోదశ రోగులుగా గుర్తించి ఆసుపత్రుల్లో చేర్పించాలి. వారికి రెమ్ డెసివిర్, ప్లాస్మా ఇస్తుంటారు. రెండో దశలో వైరస్ లోడు ఎక్కువగా లేకపోయినా, రోగనిరోధక శక్తి అస్తవ్యస్తంగా మారే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అపుడు స్టెరాయిడ్స్, ఇతర మందులు అవసరం ఉంటుంది. మొదటి దశలో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఎలాంటి చికిత్స అందించాలన్న విషయమై గ్రామీణ వైద్యులకు మార్గదర్శకాలను పంపుతున్నట్టు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో వసతులను మెరుగుపరుచుకోవడం ద్వారా కేసులను తగ్గించుకోవచ్చన్నారు. ఇందుకోసం 'బ్రేక్ ద చైన్' ఉద్యమాన్ని ప్రారంభించాలని సూచించారు.

Tags:    

Similar News