Tamil Nadu Elections: తమిళనాడులో వరాల వాన

Update: 2021-03-10 02:46 GMT

తమిళనాడులో వరాల వాన (ఫైల్ ఇమేజ్ )

Tamil Nadu Elections: సినిమాల్లో హీరో హీరోయిన్లు రాబిన్‌ హుడ్‌ ఫక్కీలో పేదలకు వస్త్రాలు పంచడం, నగదు కానుకలు ఇవ్వడం సర్వసాధారణం. సినీ నేపథ్యం నుంచి పుట్టిన ద్రవిడ పార్టీలూ ఎన్నికల్లో గెలవడానికి అదే పని చేస్తున్నాయి. ఓటర్లపై కానుకల వాన కురిపిస్తూ కళకు, జీవితానికి భేదాన్ని చెరిపేస్తున్నాయి. ఇప్పుడు మహిళలకు పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి పార్టీలు.

తమిళనాడు రాజకీయాలు విలక్షణమైనవి. అక్కడ కొన్నేళ్లుగా అన్నా డీఎంకే, డీఎంకేల మధ్యే అధికారం చేతులు మారుతోంది. జాతీయ పక్షాలకుగానీ, ఇతర ప్రాంతీయ పార్టీలకుగానీ అక్కడ చోటు లేదు. కక్ష సాధింపు రాజకీయాలు, ప్రత్యర్థులపై కేసులు పెట్టి జైళ్లపాలు చేయడం ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై వరాలు కురిపించే ట్రెండ్‌ సెట్ చేశాయి. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే దీనికి అంకురార్పణ చేసింది. ఆ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఎలాంటి ఉచిత వరాలూ ఇవ్వలేదు. డీఎంకే మాత్రం ఉచితంగా కలర్ టీవీలు, కిలో రూ. 2 బియ్యం వాగ్దానం చేసి అధికారం దక్కించుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్నాడీఎంకేకు జ్ఞానోదయమైంది. ల్యాప్‌టాప్‌లు, మిక్సర్లు, గ్రైండర్లు, ఫ్యాన్‌లు, పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు, కేబుల్ కనెక్షన్లు... అన్నీ ఉచితమే అని ప్రకటించింది. ఒక దశలో ఈ 'ఉచిత' పోటీ హద్దులు దాటింది. మేనిఫెస్టోలను కూడా పక్కనబెట్టి వేలంపాటలను తలపిస్తూ రెండు పార్టీలూ వాగ్దానాలు చేశాయి. ఇప్పుడక్కడ కరుణానిధి లేరు, జయలలిత లేరు. కానీ ఆ ట్రెండు మాత్రం కంటిన్యూ అవుతోంది.

తమిళనాడులో మహిళలపై వరాల జల్లు కురిపిస్తున్నాయి పార్టీలు. పోటాపోటీగా స్కీమ్స్‌ను అనౌన్స్ చేస్తున్నాయి. డీఎంకే-అన్నాడీఎంకేలు మ్యానిఫెస్టోల్లో స్త్రీలకే పెద్దపీట వేస్తున్నాయి. ఇప్పటికే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని స్టాలిన్ ప్రకటించారు. అంతేకాక ఇంట్లో పెద్దదిక్కయిన మహిళకు వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పారు.

మహిళలకు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామని డీఎంకే అలా ప్రకటించిందో లేదో వెంటనే అదే రాగం అందుకుంది అధికార అన్నాడీఎంకే. డీఎంకేని మించి వరాలు కురిపించింది. మహిళలకు 1000 రూపాయలు ఇస్తామని డీఎంకే అంటే, తాము మహిళలకు 1500 ఇస్తామని సీఎం పళనిస్వామి ప్రకటించారు. అంతేకాక కుటుంబానికి ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తాము ప్రకటించిన పథకాన్ని అన్నాడీఎంకే కాపీ పేస్ట్ చేశారని స్టాలిన్ విమర్శించగా, అలాంటిదేం లేదు, ఆల్రెడీ ప్రణాళికలో పొందుపరచాలని ఆలోచించామన్నారు అన్నాడీఎంకే నేతలు. మరోవైపు డీఎంకే తమ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టిందన్నారు ఎంఎన్‌ఎమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్‌.

తమిళనాడులో మొత్తం ఓటర్ల సంఖ్య ఆరు కోట్ల 26 లక్షలు. వారిలో పురుషుల కంటే మ‍హిళా ఓటర్లే అధికం. మహిళా ఓటర్ల సంఖ్య మూడు కోట్ల 18 లక్షల 28 వేల 727 కాగా, పురుష ఓటర్లు మూడు కోట్ల ఎనిమిది లక్షల 38 వేల 473. భారీ సంఖ్యలో వుమన్ ఓటర్స్ వున్నారు కాబట్టే, వారిని టార్గెట్ చేసుకుని, పార్టీలు పథక రచన చేస్తున్నాయి. నగదు బదిలీలు, ఉచిత సిలిండర్ల హామీలు ప్రకటిస్తున్నాయి. మరి ఏ పార్టీని తమిళ మహిళలు నమ్ముతారో చూడాలి. 

Tags:    

Similar News