Agneepath Scheme Protests: అగ్నిపథ్‌పై భగ్గుమన్న భారత్
Agneepath Scheme Protests: దేశంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు
Agneepath Scheme Protests: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పై యువత భగ్గుమంది. ఈ కొత్త పథకానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువజనులు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చి నిరసనాగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం ఉత్తర భారత దేశంలో అగ్గి పుట్టించింది. బీహార్ , రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీల్లో నిరుద్యోగులు అగ్నిపథ్ పథకంపై కదంతొక్కారు. పలుచోట్ల రైళ్లకు, బస్సులకు నిప్పంటించారు. బస్సుల కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. రైళ్ల రాకపోకలకు, రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగింది. మొత్తంగా 22 రైళ్లను రద్దు చేశారు. హర్యానాలోని పాల్వాల్‌లో 24గంటల పాటు ఇంటర్‌నెట్, ఎస్‌ఎంఎస్ సేవలు నిలిపివేశారు. పోలీసు వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
బీహార్‌లోని భోజ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు, ఆందోళనకారులు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. స్టేషన్ ఫర్నిచర్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వాటిని ఆర్పేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నించారు. అక్కడ నుండి వారిని వెళ్లగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. జెహనాబాద్‌లో రైల్వే ట్రాక్‌పై ఆందోళనకారులు బైఠాయించారు. పోలీసులపై రాళ్లు విసిరారు. సైన్యంలో చేరాలనుకున్న యువకులు ముజఫర్‌పూర్, బేగుసరారు, బక్సర్ జిల్లాల్లో వరుసగా రెండోరోజూ ఆందోళనల్లో పాల్గొన్నారు. జమ్మూలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. వందలాదిమంది ఆందోళనకారులు రద్దీగా వుండే తవి బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేయడంతో ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం వెలుపల పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. హర్యానాలోని గురుగావ్, రేవారి, చార్కి, పాల్వాల్‌ల్లో వందలాదిమంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
ఆందోళనకారులను బుజ్జగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా యత్నించినా నిరసన మంటలు ఆగడం లేదు. అనుమానాలు వాస్తవాలు పేరుతో ప్రభుత్వం వివరణ పత్రాన్ని విడుదల చేసింది. అగ్నివీరులుగా పనిచేసి, కాంట్రాక్టు ముగిసిపోయిన తర్వాత వ్యాపారవేత్తలుగా మారాలనుకుంటే వారికి ఆర్థిక ప్యాకేజీ అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. పై చదువులు చదవాలనుకుంటే వారికి 12వ తరగతికి సమానమైన సర్టిఫికెట్ అందజేస్తామని, పైగా బ్రిడ్జింగ్ కోర్సు అందిస్తామని తెలిపింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో, రాష్ట్ర పోలీసు నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది.