ఇండియాలో మళ్లీ పెరుగుతున్న యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య గత పక్షం రోజులుగా రోజుకు 50 వేల కంటే తక్కువగా నమోదవుతున్నప్పటికీ కొన్ని సిటీల్లో మాత్రం జూన్-జూలై నాటి పరిస్థితులను తలపిస్తుండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

Update: 2020-11-22 14:45 GMT

ఇండియాలో మళ్లీ కరోనా అక్కడక్కడా కోరలు చాస్తోంది. కరోనా కంట్రోల్ అవుతోంది కదా అని అనుకుంటున్న సమయంలో... మళ్లీ ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై అన్ని రాష్ట్రాలనూ అలర్ట్ చేసింది.

ఇండియాలో యాక్టివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నట్లే కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 45,209 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 90 లక్షల 95వేలు దాటింది. తాజాగా కరోనాతో 501 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య లక్షా 33వేల 227కి చేరింది.

పండగల సమయంలో కరోనాను తేలిగ్గా తీసుకోవడంతో కేసులు పెరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కేరళ రాష్ట్రంలో ఓనమ్‌ తర్వాత కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగింది. కేరళ రాష్ట్రంలో జరిగిన పరిణామాలను నిశితంగా గమనించిన వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పండగల సందర్భంగా మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అజాగ్రత్తగా ఉంటే కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు. వైద్యుల సూచనలను, హెచ్చరికలను ప్రజలు పట్టించుకోలేదు. పండగల సమయంలో విచ్ఛలవిడిగా తిరిగారు. దీంతో కరోనా కేసులు పెరిగాయి.

దేశంలో కరోనా కేసుల సంఖ్య గత పక్షం రోజులుగా రోజుకు 50 వేల కంటే తక్కువగా నమోదవుతున్నప్పటికీ కొన్ని సిటీల్లో మాత్రం జూన్-జూలై నాటి పరిస్థితులను తలపిస్తుండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రాజధానులు, నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూలు కానీ, 144 సెక్షన్లు కానీ విధించాలని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఎక్కువ కావడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి మాస్క్‌లు ధరించకుంటే రూ.2,000 జరిమానా విధిస్తున్నారు. పెళ్లిళ్లకు 200 మందికి బదులు 50 మంది అతిథులను మాత్రమే అనుమతిస్తున్నారు.

ముంబైలో డిసెంబర్ 31 వరకూ స్కూళ్లు మూసే ఉంచాలని బీఎంసీ ఆదేశించింది. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకూ తిరిగి పూర్తి కర్ఫ్యూ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఐదు నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు ఇండోర్, భోపాల్, గ్వాలియర్, రత్లామ్, విదిశలో నవంబర్ 21వ తేదీ నుంచి ఈ నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాజస్థాన్‌లోని అన్ని జిల్లాల్లో నవంబర్ 21 నుంచి సెక్షన్ 144 అమల్లో ఉంది.

యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాలలో ఇండియా 7వ స్థానంలో ఉండటం అధికారులను కలవరపెడుతోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ..కరోనా బారి నుంచి తమని తాము కాపాడుకోవాలని సూచిస్తున్నారు. 

Tags:    

Similar News