Ayodhya Ram Mandir: ప్రాణప్రతిష్టలో 84 సెకండ్ల ముహూర్తం..
Ayodhya Ram Mandir: 50 మందికి పైగా గిరిజన, గిరివాస, ద్వీపవాస సంప్రదాయాల క్రతువులు
Ayodhya Ram Mandir: ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఉదయం 10 గంటల నుంచే ‘మంగళ ధ్వని’తో శ్రీకారం చుట్టారు. ఇందుకు దాదాపు 20 రాష్ట్రాల నుంచి 50కి పైగా అద్భుతమైన వాయిద్యాలను తీసుకొచ్చారు. అయోధ్యకు చెందిన యతీంద్ర మిశ్రా సారథ్యంలో నిర్వహించే ఈ సంగీత ప్రదర్శనకు ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సహకారం అందించింది. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ మహరాజ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. వేడుక పూర్తయిన తర్వాత అతిథులకు రామ్‌లల్లా దర్శనం కల్పిస్తారు.
గర్భగుడిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు శుభ ముహూర్తం నిర్ణయించారు. 12 గంటల 29 నిమిషాల 08 సెకండ్ల నుంచి 30 నిమిషాల 32 సెకండ్ల వరకు మొత్తం 84 సెకన్లలో ప్రాణప్రతిష్ట పూర్తవుతుంది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యులుగా 121 మంది రుత్వికులు వేడుక నిర్వహించనున్నారు. ప్రాణ ప్రతిష్టలో శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణు నామి, వాల్మీకి, వీర శైవ మొదలైన సంప్రదాయాలు భాగం కానున్నాయి.
150 మందికిపైగా సంప్రదాయాల సాధువులు, మహామండలేశ్వర్, మహంత్, నాగాలతో సహా 50 మందికి పైగా గిరిజన, గిరివాస, ద్వీపవాస సంప్రదాయాల ప్రముఖులు పాల్గొంటారు. ఇలా పర్వతాలు, అడవులు, తీర, ద్వీప వంటి అన్ని ప్రాంతాలకు వారు ఒకే కార్యక్రమంలో పాల్గొంటుండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది.
అయోధ్య వీధులు కాషాయ రంగు పులుముకున్నాయి. నగరంలో అన్ని వీధులన్నీ కాషాయ జెండాలతో ముస్తాబైంది. తోరణాలతోపాటు విద్యుత్ దీపాలు, పూలమాలలతో అలంకరించారు. నివాస భవనాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాలపైనా పెద్ద ఎత్తున జెండాలు దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో వీటి అమ్మకాలు విరివిగా సాగుతున్నాయి. శ్రీరాముడు, హనుమంతుడు, నూతన రామాలయ చిత్రాలు, జైశ్రీరామ్ నినాదంతో కూడిన ఈ జెండాలు, తోరణాలు చూపరులకు ఆధ్యాత్మిక భావనలు పంచుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలతోపాటు దాతలు శ్రీరాముడి జెండాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అయోధ్యలోని రామ్‌పథ్, ధర్మపథ్‌ను జెండాలతో ప్రత్యేకంగా ఆలంకరించారు. వీధుల్లో శ్రీరాముడి పాటలు మార్మోగుతున్నాయి.
శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వేడుక కేవలం ఆయోధ్యకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఉత్సవంలో పాలుపంచుకోబోతున్నారు. సోమవారం ర్యాలీలు, ప్రదర్శనలు, పాదయాత్రలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో దాదాపు 300 ప్రాంతాల్లో ప్రాణప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద కూడా స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. పారిస్‌లో హిందూ సమాజం ఆధ్వర్యంలో భారీ రథయాత్ర నిర్వహించనున్నారు. అలాగే విశ్వ కల్యాణ యజ్ఞం నిర్వహిస్తారు. ఇంగ్లాండ్, ఆ్రస్టేలియా, కెనడా, మారిషస్ సహా 60కిపైగా దేశాల్లో వేడుకలు జరుగుతాయి. ఆయా దేశాల్లోని హిందూ ఆలయాల్లో సాయంత్రం దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ప్రత్యేక క్రతువుల్లో భాగంగా ఆదివారం ఔషధ జలంతోపాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో రామ్‌లల్లాను శుద్ధి చేశారు. రాత్రి జాగరణ అధివస్ జరిపారు. 16న మొదలైన కొన్ని క్రతువులు నేటితో ముగుస్తాయి. ప్రాణప్రతిష్ట అనంతరం భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పించడానికి ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. నిత్యం మూడుసార్లు ప్రత్యేక హారతి నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటలకు జాగరణ్ హారతి, మధ్యాహ్నం 12.00 గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఇవ్వనున్నారు.