ఆప్ ఎంపీపై ఇంకు చల్లిన గుర్తుతెలియని వ్యక్తి
హత్రాస్‌లో సామూహిక అత్యాచారం, హత్యతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో మహిళలపై జరిగిన దాడులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా..
హత్రాస్‌లో సామూహిక అత్యాచారం, హత్యతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో మహిళలపై జరిగిన దాడులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సోమవారం కూడా నిరసనలు కొనసాగించాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వేధింపులకు గురైన బాధితులను పరామర్శించడానికి ప్రతినిధులను పంపాలని సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రతినిధి బృందం సోమవారం హత్రాస్‌ను సందర్శించి బాధితురాలి బంధువులను పరామర్శించింది. ఈ సందర్బంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. హత్రాస్ గ్రామంలో బాధితురాలి ఇంటిలో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి బయటకు రాగానే సంజయ్ సింగ్ పై గుర్తుతెలియని వ్యక్తి ఇంకు చల్లాడు.
అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ కేబినెట్ మంత్రి రాజేందర్ పాల్ గౌతమ్‌తో పాటు ఆప్ రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్.. పార్టీ యుపి యూనిట్ ప్రతినిధి బృందం పరామర్శకు వెళ్ళింది. హత్రాస్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేయాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తుకు సిఫారసు చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రంలో కుల, మత అల్లర్లను ప్రేరేపించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.