Face Mask Painting: మాస్క్ అంటూ మస్కా కొట్టిన యువతి..పాస్ పోర్టు సీజ్
Face Mask Painting: ఇద్దరు యువతులు మాస్క్ కు బదులు అదే తరహాలో ఫేస్ మీద పెయింటింగ్ వేయించుకున్నారు.
Face Mask Painting: ఎంత జాగ్రత్తగా వున్నా కరోనా మహమ్మారి దాడి చేస్తోంది. దీంతో చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతోంది. కోవిడ్ కట్టడిలో భాగంగా సమస్త శాస్త్రవేత్తలు, వైద్యులు.. ప్రజలంతా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని గొంతు చించుకుంటున్నారు. అయినా కొందరు ఏమాత్రం లెక్కచేయకుండా మాస్క్ పెట్టుకునేందుకు ఇష్టపడటం లేదు. పైగా మాస్క్ తమ అందానికి ఆటంకమని భావిస్తున్నారు. ఇదే విధమైన ఆలోచన కలిగిన ఇద్దరు యువతులు మాస్క్ కు బదులు అదే తరహాలో ఫేస్ మీద పెయింటింగ్ వేయించుకున్నారు. అయితే, ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు.. సదరు యువతుల పాస్‌పోర్టులను రద్దు చేశారు.
ఇండోనేషియాలోని బాలిలో ఇద్దరు యువతులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని.. వారి పాస్‌పోర్టులను అధికారులు సీజ్ చేశారు. మాస్క్ పెట్టుకునేందుకు బదులు ఫేస్‌కు పెయింటింగ్ వేయించుకున్నట్లు అధికారులు నిర్ధారించుకున్నారు. జోష్ పాలర్ లిన్, లీయా అనే ఇద్దరు యువతులు ఏదో వీడియో తీసేందుకు సూపర్ మార్కెట్‌కు వచ్చారు. నీలి రంగు సర్జికల్ మాస్క్ మాదిరిగా ముఖానికి వారు పెయింటింగ్ వేయించుకున్నారు. వీరు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, ఈ వీడియోను చూసినవారు ఆ మహిళలు మాస్క్‌కు బదులు పెయింటింగ్ చేయించుకోవడాన్ని గమనించారు. ఇది చట్ట విరుద్దమని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ విషయం కాస్తా అధికారుల దృష్టికి వెళ్లింది.. ఈ నేపధ్యంలో ఇండోనేషియా అధికారులు ఆ మహిళలను గుర్తించి, వారి పాస్ పోర్టులను సీజ్ చేశారు.