ఆసుపత్రిలో వింత.. దానంతట అదే కదిలి వెళ్ళిపోయిన వీల్ చైర్!
దానంతట అదే కదిలిన వీల్ చైర్ వీడియొ సంచలనం కలిగిస్తోంది. ఈ సంఘటన చండీఘర్ లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
ఒక్కోసారి కొన్ని విషయాల్ని ఎవరైనా చెబితే అసలు నమ్మలేం. అదే సంఘటనల్ని దృశ్యరూపంలో చూస్తే విపరీతమైన ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా ఎలా జరిగింది అనిపిస్తుంది. మనవి నిజంగా మూఢ నమ్మకాలా.. సైన్స్ కి అందని సంగతులు ఉన్నాయా అనిపిస్తుంది. చంఢీఘర్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకున్న వింతను సీసీ కెమెరా నిక్షిప్తం చేసింది. ఆ వీడియో చూసిన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.
చంఢీఘర్‌లోని పీజీఐ ఆస్పత్రిలో ఎవరి ప్రమేయం లేకుండానే వీల్ చైర్ ఒకటి కదిలి నేరుగా ఆసుపత్రి బయటకు వెళ్ళిపోయింది. ఈ సంఘటన ఈనెల 19వ తేదీన చోటుచేసుకుంది. ఆ వీల్ చైర్ కదులుతూ ముందుకు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న గార్డ్ కూడా ఆశ్చర్యంతో.. ఒకింత భయంతో నిశ్చేష్టుడై నిలబడి పోయిన విషయం కూడా ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఆసుపత్రి సిబ్బంది గాలికి ఆ వీల్ చైర్ కదిలింది ఏమో అనుకున్నారట. అయితే, అదే సమయంలో ఆ వీల్ చైర్ పక్కనే ఉన్న ఇతర చైర్ లు గానీ, వస్తువులు కానీ ఏమాత్రం కదలక్కుండా ఉండడం వారికి పలు అనుమానాలు కలిగేలా చేసింది. ఈ సంఘటన గురించి తెలిసి వీడియో చూసిన వారంతా రకరకాలుగా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు.
కొసమెరుపు ఏమిటంటే.. ఈ ఆసుపత్రిలో గతంలో మార్చురీ వద్ద స్ట్రెచర్ కూడా ఇలానే ఎవరి ప్రమేయం లేకుండానే దానంతట అదే కదిలి ముందుకు వెళ్ళిపోయింది.