Char Dham Yatra: చార్‌ధామ్‌లో యాత్రలో విషాదం.. నెలరోజుల్లో 99 మంది మృత్యువాత
Char Dham Yatra 2022: కేధార్‌నాథ్ మార్గంలోనే అత్యధికంగా మృతి
Char Dham Yatra 2022: చార్‌ధామ్ పవిత్రమైన నాలుగు పుణ్య క్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని ప్రతి హిందువు భావిస్తాడు. హిమసానువుల్లో కొలువైన కేదార్‌నాథ్, బదిరీనాథ్, గంగ్రోత్రి, యమునోత్రి క్షేత్రాలను చూసి తమ జన్మను పావనం చేసుకోవాలనుకుంటారు. అత్యంత క్లిష్టమైన చార్‌ధామ్ యాత్రలో దైవదర్శానికి వెళ్తున్న భక్తులు.. ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతున్నారు. యాత్ర ప్రారంభమైన నాటి నుంచి నెలలోపు 99 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా ఎనిమిది మందికి పైగా చనిపోవడం కలకలం రేపుతోంది. యాత్రకని వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్తుండడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. సాధ్యమైనంత వరకు భక్తులను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ శైలజా భట్ తెలిపారు.
కోవిడ్ అనంతరం రెండేళ్ల తరువాత చార్‌దామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమసానువుల్లో కొలువైన కేదార్‌నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిస్తున్నారు. నాలుగు పుణ్యక్షేత్రాల్లోని వాతావరణ పరిస్థితులు కారణంగా ఏటా ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయాలను తెరిచి ఉంచుతారు. మేలో వచ్చే అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు ఈ ఆలయాల్లో భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈనెల 3న గంగోత్రి, యమునోత్రి, 6న కేదార్‌నాథ్, 8న బదరీనాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. వీటిలో ముఖ్యంగా జ్యోతిర్లంగ క్షేత్రమైన కేదార్‌నాథ్‌కు భక్తులు పోటెత్తుతున్నారు. చార్‌థామ్ యాత్రకు వెళ్లే భక్తులు ఉత్తరాఖండ్ పర్యాటక పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ థామీ సూచించారు. ఆమేరకు ఇప్పటి వరకు పోర్టల్‌లో లక్షా 50 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు పుణ్య క్షేత్రాలకు తరలిస్తున్నారు.
చార్‌ధామ్‌లోని పుణ్య క్షేత్రాలను సందర్శించి.. తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఉత్తరాఖండ్‌కు భక్తులు తరలిస్తున్నారు. అయితే దైవ దర్శనానికి ముందే మార్గమధ్యలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని పాండవ షెహ్రా ప్రాంతంలోని మంచుకొండల్లో కాలినడకన వెళ్తున్న ఏడుగురు భక్తులు అదృశ్యమయ్యారు. పుష్కర్‌సింగ్ థామి ప్రభుత్వం వారి కోసం గాలింపు చర్చలను చేపట్టింది. ఈసారి చార్‌ధామ్ యాత్ర మొదలైన నెలరోజుల లోపే 99 మంది చనిపోయారు. గత యాత్రలతో పోలిస్తే మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఎత్తైన కొండలపైకి వెళ్తున్న కొద్దీ.. గుండె, శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్న భక్తులు కొందరు ప్రాణాలు కోల్పుతున్నారు. ఆరునెలల పాటు సాగే ఈ యాత్రలో 2017లో 112 మంది భక్తులు మృతి చెందారు. 2018లో 102 మంది, 2019లో 90 మంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కానీ ఈసారి నెల కూడా గడవక 99 మంది భక్తులు మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది.
చార్‌ధామ్ వెళ్లడమంటే సహస యాత్ర చేయడమే. యాత్రలో వాగులు, వంకలు ఎన్నో ఉంటాయి. యాత్ర మార్గాల్లో ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతుంటాయి. అందుకే ఈ యాత్రకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి.. ఆరోగ్యవంతులనే అనుమతిస్తుంటారు. అయినా పలువురు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యాత్రలో మరణాలకు నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. ఎత్తైన కొండల్లోని మంచు వాతావరణానికి భక్తులు అలవాటుపడకపోవడం కరోనా బారినపడిన వారిలో రోగ నిరోధక శక్తి తగ్గడం, యాత్రికులకు తగినట్టుగా ఏర్పాట్లు చేయడం లేదు. వాతావరణానికి తగినట్టు భక్తులు దస్తులు ధరించడం లేదు. అంతేకాకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలను కూడా భక్తులు గాలికొదిలేస్తున్నారు. మృతుల్లో ఎక్కువగా వృద్దులే ఉన్నారు. అది కూడా కేధార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలోనే అత్యధికంగా మృతి చెందుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
చార్‌ధామ్ మార్గాలో సరైన వసతులు, వైద్య సదుపాయాలు లేవని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తూతూ మంత్రంగా ఏర్పాట్లు చేసి.. చేతులు దులుపుకుంటున్నట్టు విమర్శిస్తున్నారు. మార్గ మధ్యలో ప్రకృతి విపత్తుల కారణంగా యాత్ర నిలిచిపోతే కనీస వసతులు కూడా కల్పించడం లేదంటున్నారు. మరోవైపు యాత్రలో భాగంగా.. భక్తులను, వారి ఆహార పదార్థాలను తరలించేందుకు వినియోగించే మూగ జీవులు కూడా మృత్యువాతపడుతున్నాయి. 20 రోజుల్లో 60 మూగజీవాలు చనిపోయినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది మూగజీవుల మరణాలు తక్కువేనని ఆ రాష్ట్ర పశు సంవర్దక శాఖ తెలిపింది.
ఏదేమైనా పుణ్య క్షేత్రాల సందర్శన.. పలు కుటుంబాల్లో విషాదం నింపుతోంది. పర్యాటనకు వచ్చే భక్తులు.. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు తప్పనిసరి పాటించాలని అప్పుడే సురక్షితంగా యాత్రను పూర్తి చేసుకుని ఇళ్లకు చేరవచ్చని ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ సూచిస్తోంది.