Parliament: సస్పెన్షన్ల పర్వం.. 95 మంది లోక్‌సభ ఎంపీలపై వేటు
Parliament: భవనం వద్ద మాక్ పార్లమెంటు నిర్వహించిన విపక్ష సభ్యులు
Parliament: భారత పార్లమెంట్ దద్దరిల్లుతోంది. ఆందోళనలు, సస్పెషన్లతో అట్టుడికిపోతుంది. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టగా అందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్‌లో అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తో్ంది. సభా కార్యకలాపాలకు విపక్ష ఎంపీలు అడ్డుతగలడంతో వారిపై సస్పెషన్ వేటు వేస్తోంది ప్రభుత్వం. సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 141కు పెరిగింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్‌కు గురి కావడం ఇదే తొలిసారి.
ఈనెల 13 నుంచి పార్లమెంట్ సభ్యులపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. నిన్న 78 మంది సభ్యులను సస్పెండ్ చేయగా.. మంగళవారం మరో 49 మంది ఎంపీలపై వేటు పడింది. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఫరూఖ్ అబ్దుల్లా, శశిథరూర్, మనీశ్ తివారి, సుప్రియా సూలే, కార్తి చిదంబరం, ఫైజల్, సుదీప్ బందోపాధ్యాయ, డింపుల్ యాదవ్, డానిష్ అలీ ఉన్నారు.
డిసెంబరు 13న పార్లమెంట్‌పై దాడి ఘటనను విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభా కార్యకలాపాలకు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
మరోవైపు ఉభయసభల్లో సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు వెలుపల ఆందోళన కొనసాగిస్తున్నారు. కొత్త పార్లమెంటు భవనం మకర ద్వారం వద్ద మాక్ పార్లమెంటు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖడ్ మాదిరిగా తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయగా మిగిలిన ఎంపీలు హర్షధ్వానాలు చేశారు. రాహుల్ గాంధీ తన సెల్‌ఫోన్లో మిమిక్రీ ఘటనను వీడియో తీశారు. దీనిపై అధికారపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను, స్పీకర్‌ను అనుకరిస్తూ మిమిక్రీ చేయడంపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ చర్య సిగ్గుచేటని రాజ్యసభలో వ్యాఖ్యానించారు.
95 మంది లోక్‌సభ ఎంపీలపై ఇప్పటివరకు వేటు పడింది. మరోవైపు రాజ్యసభలో ఇప్పటి వరకు మొత్తంగా 46 మందిని సస్పెండ్ చేశారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 22తో ముగియనున్నాయి. విపక్షాల ఆందోళన నేపథ్యంలో మంగళవారం కూడా ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉభయ సభల్లో సభా కార్యక్రమాలు స్తంభించాయి.
పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయడం సహా విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. మరోవైపు, సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు అడిగిన 27 ప్రశ్నలను లోక్‌సభ ప్రశ్నల జాబితా నుంచి తొలగించడం గమనార్హం.