Al-Qaeda Terrorists Arrested: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధం ఉన్న 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్సీదాబాద్‌తో పాటు కేరళలోని ఎర్నాకుళం నుంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. రెండు చోట్ల ఎన్ఐఏ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించి వారిని అరెస్టు చేశారు.
నిషేధిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన 9 మంది ఉగ్రవాదులు ముర్షిదాబాద్, ఎర్నాకుళం కేంద్రాలుగా పనిచేస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అల్‌ఖైదాకు చెందిన అంత ర్రాష్ట్ర ఉగ్రముఠా పశ్చిమబెంగాల్, కేళలోని వివిధ ప్రాంతాల్లో సామాన్య ప్రజలే లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడేందుకు పన్నాగం పన్నుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మరి కొందరిలో ఉగ్రబీజాలు నాటేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో దాడులు నిర్వహించి వారందరినీ అరెస్టు చేశాం అని ఎన్‌ఐఏకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు.