UP Elections 2022: ఇవాళ యూపీలో ఆరో విడత ఎన్నికలు.. త్రిముఖ పోటీ...
UP Elections 2022: *10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ *ఎన్నికల బరిలో 676 మంది అభ్యర్థులు
UP Elections 2022: యూపీలో ఆరో విడత పోలింగ్‌కు సర్వ సిద్ధమైంది. ఇవాళ 10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. బలరాంపూర్, సిద్ధార్ద్‌నగర్, మహరాజ్‌గంజ్, ఖుషీనగర్, బస్తీ, సంత్ కబీర్‌నగర్, అంబేద్కర్ నగర్, డియోరియా, బలియాతో పాటు గోరఖ్‌పూర్ జిల్లాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 676 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
ఇక.. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోవైపు.. సీఎం ఆదిత్యనాథ్ యోగి పోటీ చేస్తున్న గోరఖ్‌పూర్‌పైనే అందరి దృష్టి ఉంది. ఇంకోవైపు.. బహుజన, దళితుల ప్రాబల్యం కలిగిన ఈ ప్రాంతంలో బీఎస్పీ కూడా ప్రధాన పార్టీలకు ధీటైన పోటీ ఇవ్వనుంది.
దాదాపు 20ఏళ్ల తర్వాత ఆదిత్యనాథ్ యోగి మళ్లీ గోరఖ్‌పుర్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గోరఖ్‌పూర్ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో బ్రాహ్మణులు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో యాదవేతర ఓబీసీలు, బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల అండదండలతో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.
ఇక.. యాదవులు, ఇతర ఓబీసీలు, ముస్లిం ఓట్ల మద్దతుతో అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ పావులు కదుపుతోంది. అటు.. దళితుల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి సారథ్యంలోని బీఎస్పీ చెమటోడుస్తోంది. మార్చి 7న చివరి విడత పోలింగ్‌తో యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. ఇక.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.