Pokhran-1 Nuclear Test: భారత్ తొలి అణు పరీక్షలకు నేటితో 50 ఏళ్ళు
Nuclear Bomb Test: పోఖ్రాన్-1 పరీక్షకు 50 ఏళ్లు పూర్తి
Nuclear Bomb Test: 1974 మే 18.. భారత దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ప్రపంచ యవనికపై మన దేశం సాంకేతిక సత్తా చాటిన రోజు. యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పొరుగు దేశాలకు గట్టి సందేశం పంపిన రోజు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే రోజు భారత్ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది. తద్వారా ఆ సత్తా చాటిన అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన సగర్వంగా నిలిచింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంలేని దేశం అణు పరీక్ష నిర్వహించడం అదే తొలిసారి. దీనిపై అగ్గిమీద గుగ్గిలమైన కొన్ని అగ్రరాజ్యాలు ఆంక్షలతో అక్కసు వెళ్లగక్కాయి. అయినా మన దేశం నిలదొక్కుకుంది. సాంకేతిక పురోగతితో ముందడుగు వేసింది.
భారత్ అణు పరీక్షకు పూనుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. 1962లో మన దేశంపై చైనా దురాక్రమణకు పాల్పడింది. అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని ఆక్రమించింది. 1964లో అణ్వస్త్రాన్ని పరీక్షించింది. ఇది భారత్‌ను ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే సంప్రదాయ ఆయుధాల విషయంలో మనకన్నా పైచేయి సాధించిన ప్రత్యర్థి.. అణ్వస్త్రం విషయంలోనూ ముందంజలో ఉన్నట్లు గుర్తించింది.
ఇటు పక్క పాకిస్థాన్ రూపంలోనూ మరో శత్రుదేశం భారత్‌కు ఉంది. 1965 నాటికి ఆ దేశంతో రెండు యుద్ధాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు దీటుగా రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకొని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్నది లక్ష్యం. దీన్ని సాధించే దిశగా అణ్వస్త్రాల అభివృద్ధి కీలక అడుగు అని మన దేశం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది.
మన అణుపరీక్షల చరిత్ర చాలా విస్తారమైంది. 1944లో హోమీ జహంగీర్ భాభా.. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ను ఏర్పాటు చేయడంతో భారత అణు కార్యక్రమానికి పునాదులు పడ్డాయి. స్వాతంత్య్రం వచ్చాక అణు పరిశోధనలకు నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లాంఛనంగా అనుమతినిచ్చారు.
భాభా నేతృత్వంలో క్రమంగా అణ్వాయుధ రూపకల్పన వైపు అడుగులు పడ్డాయి. 1954 నుంచి 1959 మధ్య ఈ పరిశోధన ఊపందుకుంది. భాభా మరణం తర్వాత అణ్వస్త్ర పరిశోధన కార్యక్రమాన్ని భౌతికశాస్త్రవేత్త రాజా రామన్న పర్యవేక్షించారు. 1966లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అణు కార్యక్రమంలో జోరు పెరిగింది. అణు సాధనాన్ని రూపొందించి, పరీక్షకు సిద్ధం చేయడానికి భాభా అణు పరిశోధన కేంద్రం బార్ కి 1972 సెప్టెంబరు 7న ఇందిరా గాంధీ అనుమతిచ్చారు.
అణు పరీక్షకు ప్రభుత్వం పచ్చజెండా ఊపాక దాన్ని సాకారం చేయడానికి రెండేళ్లపాటు పరిశోధకులు కసరత్తు చేశారు. ‘బార్క్’ డైరెక్టర్ హోదాలో రాజా రామన్న నేతృత్వంలో పి.కె.అయ్యంగార్, రాజగోపాల చిదంబరం తదితరులతో కూడిన 75 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందం ఈ బాంబు రూపకల్పన, పరీక్షలో పాలుపంచుకుంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా అందులో ఉన్నారు. అణు బాంబుకు మీటను ప్రణబ్ దస్తిదార్ రూపొందించారు. ఈ అణు బాంబులో వాడిన ఆయుధ గ్రేడ్ ప్లుటోనియం అభివృద్ధిలో.. రసాయన ఇంజినీరు హోమీ సెథ్నా కీలక పాత్ర పోషించారు.
రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో ఉన్న పోఖ్రాన్ అనే మారుమూల ప్రదేశాన్ని ఈ పరీక్ష కోసం ఎంచుకున్నారు. 1974 మే 18న ఉదయం 8.05 గంటలకు అణు పరీక్ష జరిగింది. ప్రణబ్ దస్తిదార్ మీట నొక్కి ఈ విస్ఫోటాన్ని నిర్వహించారు. పరీక్ష దిగ్విజయంగా సాగింది. వాతావరణంలో ఎలాంటి రేడియోధార్మికత కనిపించలేదు. పరీక్ష విజయవంతమైన విషయాన్ని ‘బుద్ధుడు ఎట్టకేలకు నవ్వాడు’ అనే సంకేతనామం ద్వారా ఫోన్లో ఇందిరకు రాజా రామన్న తెలియజేశారు. ప్రపంచాన్ని అణ్వస్త్రసహిత, రహిత దేశాలుగా విభజించిన అణు వ్యాప్తి నిరోధక చట్టం ఖరారైన ఆరేళ్ల తర్వాత మన దేశం ఈ పరీక్ష నిర్వహించడం విశేషం.
ఈ అణు పరీక్షకు ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా’ అని పేరు పెట్టారు. బుద్ధ జయంతి కూడా అదే రోజు కావడంతో ఈ పేరు ఖరారు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం దీన్ని పోఖ్రాన్-1గా నామకరణం చేసింది. ప్రపంచ దేశాల్లో ఆగ్రహావేశాలను చల్లార్చడానికి ఈ పరీక్షను ‘శాంతియుత అణు విస్ఫోటం’గా ఇందిర అభివర్ణించారు. దాదాపుగా అన్ని దేశాలూ భారత అణుపరీక్షను ఖండించాయి.
కెనడా భారీగా ఆంక్షలు విధించింది. భారత్‌కు అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ఆంక్షలూ విధించింది. మన అణు పరీక్షలకు స్పందనగా అణు సరఫరాదారుల కూటమి ఏర్పాటైంది. అణు సంబంధిత పదార్థాలు, యంత్రాల ఎగుమతులను నియంత్రించడం దీని ఉద్దేశం. ఇలా ఎన్ని ప్రతికూలతలు ఉన్నా.. భారత్ వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని అణుదేశంగా నిలబడి.. ప్రపంచంలో తన సత్తా చాటింది.
Also Read: పోఖ్రాన్‌లో అణు పరీక్షలు చేసినప్పుడు వాజ్‌పేయి ప్రభుత్వం అమెరికాను ఎలా బురిడీ కొట్టించింది?