సురక్షితంగా భారత్ చేరుకుంటున్న ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులు.. ఇప్పటికే 469 మంది...
India Students - Ukraine Conflict: విద్యార్థులకు స్వాగతం పలికిన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా...
India Students - Ukraine Conflict: యుద్ధభూమి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే 'ఆపరేషన్ గంగా'లో భాగంగా.. 250 మందితో బుకారెస్ట్ నుంచి బయల్దేరిన రెండో విమానం.. ఢిల్లీకి చేరుకుంది. క్షేమంగా భారత్‌కు చేరుకున్న విద్యార్థులకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్వాగతం పలికారు.
ఉక్రెయిన్ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని సూచించారు. ఢిల్లీకి చేరుకున్నవారిలో ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే నిన్న రాత్రి బుకారెస్ట్ నుంచి ముంబైకి 219 మంది భారతీయులతో తొలి విమానం చేరుకుంది. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి రెండు విమానాల్లో ఢిల్లీ, ముంబైకి 469 మంది భారతీయ విద్యార్థులు చేరుకున్నారు. మరోవైపు.. సురక్షితంగా భారత్‌కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.