పెను విషాదం: కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 45 మంది మృతి

Update: 2021-02-16 12:58 GMT

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిధి జిల్లాలో పట్నా దగ్గర వంతెనపై బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ బస్సులో 60మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 45 మంది చనిపోయారు. మిగతా వాళ్లు గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డ్రైవర్‌తో సహా ఏడుగురు ప్రయాణికులు ఈత కొడుతూ ఒడ్డుకు చేరారని అధికారులు తెలిపారు. మిగతా ప్రయాణికుల కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి.

వాహనం వేగంగా నడుపుతూ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. వంతెనపై నుంచి పడిన తర్వాత బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కాల్వలో ప్రవాహానికి బస్సు కొంతదూరం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఇద్దరు మంత్రులు ఘటనా స్థలానికి వెళ్తున్నారని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

Tags:    

Similar News