లష్కరే తోయిబా కుట్రను కాశ్మీరీ పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద దాడులే కాకుండా వాటికి అవసరమైన నగదు సమకూర్చుకునేందుకు భారత్ పై కుట్రలు చేస్తున్నారు. భారత్ పౌరులకు హెరాయిన్ అమ్మి వీలైనంత నిధులు సమకూర్చుకునేలా ప్రణాళికలు చేసింది. అయితే కాశ్మీరీ పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు. హెరాయిన్ తో పాటు వాటిని అమ్మకం చేసేందుకు వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున హెరాయిన్, ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కశ్మీర్ మీదుగా ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో సహకరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగదు లావాదేవీలు జరగకుండానే ఇలా డ్రగ్స్ సప్లై చేస్తూ వచ్చిన నగదును లష్కరే ఉగ్రవాదుల సంస్థలకు అందజేస్తూ హవాలా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి 21 కిలోల హెరాయిన్‌తో పాటు.. రూ.1.34 కోట్ల రూపాయల ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
పట్టుబడ్డ ఉగ్రవాద సహచరులు పాక్‌లోని పలువురితో సన్నిహితంగా ఉంటూ.. డ్రగ్స్, హవాలా వ్యాపారం కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన అనుచరులను అరెస్ట్ చేశామని.. ఈ టెర్రర్ మాడ్యూల్ వెనుక మరికొంత మంది ఉన్నట్లు గుర్తించామని హంద్వారా ఎస్పీ సుందీప్ చక్రవర్తి తెలిపారు. త్వరలో దీనికి సంబంధించిన వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.