దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కలవరం.. 358 కి చేరిన ఓమిక్రాన్ కేసులు

*అత్యధికంగా మహారాష్ట్రలో 88, ఢిల్లీలో 67, తెలంగాణలో 38 కేసులు *ఒమిక్రాన్ నుంచి కోలుకున్న 114 మంది

Update: 2021-12-25 03:00 GMT

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కలవరం

Omicron in India: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపిస్తోంది. ఇక భారత్‌లో కూడా మెల్లమెల్లగా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దేశంలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 358 మంది ఈ వేరియంట్ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 114 మంది ఈ కొత్త వేరియంట్‌ నుంచి కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాపించింది. మహారాష్ట్రలో అధికంగా 88, ఢిల్లీలో 67, తెలంగాణలో 38 కేసులు నమోదు అయినట్లు తెలిపింది.

ఒక్కరోజులో 122 కేసులు రావడం ఆందోళన కలిగించే అంశమని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో డెల్టా వేరియంట్‌ కేసులే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఒమిక్రాన్‌ వేగంగా ప్రబలే లక్షణాన్ని కలిగి ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ కొత్త రకం కేసులు 1.5 నుంచి 3 రోజుల్లో రెట్టింపయ్యే అవకాశం ఉందని తెలిపింది. అందుకు తగ్గట్టే ప్రతి ఒక్కరూ కొవిడ్ రూల్స్‌ను పాటించాలని విజ్ఞప్తి చేసింది.

ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలుచేస్తుండగా.. తాగాగా మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్‌, యూపీ, ఒడిశా ప్రభుత్వాలు ఒమిక్రాన్‌ కట్టడికి కఠిన నిబంధనల్ని ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూని విధించింది. ఆ సమయంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆంక్షలు పెట్టింది. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లు, జిమ్‌లకు అనుమతించింది. వేడుకల్లో 100 మందికి మాత్రమే అనుమతిస్తామని, బహిరంగ వేడుకల్లో అయితే 250 మంది వరకు అనుమతిస్తామని స్పష్టంచేసింది. ఈ అర్ధరాత్రి నుంచే ఆంక్షలు అమలులోకి వస్తాయని స్పష్టంచేసింది.

ఇక శుక్రవారం రాత్రి నుంచి హరియాణాలో నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాక రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. గుజరాత్‌లో తొమ్మిది నగరాల్లో నైట్‌ కర్ఫ్యూ వేళల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. అహ్మదాబాద్‌, వడోదర, సూరత్‌, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌, జామ్‌నగర్‌, గాంధీనగర్‌, జునాగఢ్‌లలో ఇవాళ్టి నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఒమిక్రాన్‌ భయాల దృష్ట్యా క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై ఒడిశా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబర్‌ 25 నుంచి జనవరి 2 వరకు పలు ఆంక్షలు అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌సీ మహాపాత్ర ఉత్తర్వులు జారీచేశారు. క్రిస్మస్‌ వేడుకల్లో 50 మంది కన్నా ఎక్కువమంది హాజరుకావొద్దని, కొవిడ్‌ నిబంధనల్ని కఠినంగా పాటించాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలను హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, పార్కులు, కన్వెన్షన్‌ హాళల్లో నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధం విధించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు ఒడిశాలో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇవాళ్టి నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉండనుంది. అలాగే వివాహాలు, వేడుకలకు 200 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News