Prashant Kishor: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు

Prashant Kishor: పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ మంగళవారం నాడు ఇండియాటుడే తో ప్రత్యేకంగా మాట్లాడారు

Update: 2024-05-22 06:28 GMT

Prashant Kishor: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు

Prashant Kishor Predicts: ప్రశాంత్ కిషోర్ పార్లమెంట్ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి దాదాపుగా 300 సీట్లు వస్తాయని పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు.

పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ మంగళవారం నాడు ఇండియాటుడే తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లను సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బీజేపీ 370 సీట్లను సాధిస్తుందని మోడీ సహా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ బీజేపీ స్వంతంగా 300 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన 303 సీట్లకంటే కొన్ని ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తుందని తాను విశ్వసిస్తున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

దక్షిణాదిలో బీజేపీకి సీట్లు పెరుగుదల

దేశంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీకి పెద్దగా నష్టం వాటిల్లదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఉత్తర,పశ్చిమ రీజియన్లలో కమలం పార్టీకి పెద్దగా నష్టం ఉండదని ఆయన వివరించారు. అదే సమయంలో దేశంలోని తూర్పు,దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందని ప్రశాంత్ కిషోర్ వివరించారు.

2019 ఎన్నికల్లో బీజేపీ 303 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఇందులో 250 సీట్లు ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోనివే. అయితే ఈ దఫా ఈ ప్రాంతాల్లో సుమారు 50 ఎంపీ సీట్లను బీజేపీ కోల్పోయే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.అదే సమయంలో దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బీజేపీ 50 స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. అంతేకాదు ఈ ప్రాంతాల్లో బీజేపీ ఓటు షేరింగ్ కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఒక పార్టీ లేదా ప్రభుత్వం ప్రజల విశ్వాసానికి దూరమైన సమయంలో ఆ పార్టీ లేదా ప్రభుత్వం పడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మోడీ పదేళ్ల పాలన తర్వాత కూడా ప్రజల్లో ఆయనపై తీవ్రమైన ఆగ్రహం లేదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏమన్నారంటే?

ప్రశాంత్ కిశోర్ మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని ఆయన ఎన్నికలకు ముందు చెప్పారు. పోలింగ్ తరువాత కూడా అదే మాట అన్నారు. అయితే, వైఎస్ జగన్ ఆయన మాటలకు కౌంటర్ ఇచ్చారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్ టీమ్ సభ్యులతో మాట్లాడుతూ ఆయన, 2019 ఎన్నికల్లో కన్నా ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. జగన్ కామెంట్స్ మీద రియాక్షనా అన్నట్లుగా ప్రశాంత కిశోర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఓటమిని ఎవరూ ముందు అంగీకరించరని, ఫలితాలు వస్తున్నప్పుడు కూడా ట్రెండ్స్ వ్యతిరేకంగా ఉన్నా కూడా రాజకీయ పార్టీలు తామే గెలుస్తున్నామని చెబుతారని ఆయన అన్నారు. ఫలితాలు పూర్తిగా వెలువడితే గానీ ఎవరూ వాస్తవాలు అంగీకరించరని ఆయన వ్యాఖ్యానించారు.

2019లో వైఎస్ఆర్సీపీకి పనిచేసిన ప్రశాంత్ కిశోర్

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు వైఎస్ఆర్సీపీ పనిచేసింది. 2019 పోలింగ్ ముగిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఈ ప్రకటనపై అప్పట్లో చంద్రబాబు సహా టీడీపీ నేతలు మండిపడ్డారు.ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, డీఎంకెలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తర్వాత ఐ ప్యాక్ కు ప్రశాంత్ కిశోర్ గుడ్ బై చెప్పారు. ఏపీలో మాత్రం ఐప్యాక్ జగన్ కోసం పనిచేసింది.

ఐ ప్యాక్ సూచనల మేరకు అభ్యర్థుల మార్పు

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఐప్యాక్ టీమ్ అందించిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేశారు. కొందరు సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇవ్వలేదు. కొందరు సిట్టింగ్ లను కొత్త స్థానంలో బరిలోకి దింపారు. టిక్కెట్లు దక్కనివారికి నామినేటేడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. టిక్కెట్లు దక్కని అభ్యర్ధులు కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లారు.

చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ ఏడాది మార్చిలో హైద్రాబాద్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పనిచేయాలని ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు కోరారు. అయితే ఈ ప్రతిపాదనను ప్రశాంత్ కిషోర్ తిరస్కరించారు. చంద్రబాబుతో భేటీ తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేశారు. చంద్రబాబుకు లబ్దికోసమే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఏది ఏమైనా ఈసారి ఆయన అంచనాలు నిజమవుతాయా అన్న ప్రశ్న రాష్ట్రమంతటా వినిపిస్తోంది. ఆయన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయన్నది మాత్రం కాదనలేం.

Tags:    

Similar News