Corona Cases in India: భారత్ లో 30 వేల లోపు కరోనా కేసులు
* 400 దిగువకు మరణాలు * 97.45 శాతానికి పెరిగిన రికవరీ రేటు
Corona Cases in India: దేశంలో గత కొంతకాలంగా కరోనా వ్యాప్తిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా కొత్త కేసులు, మృతుల సంఖ్య భారీగా తగ్గింది. కేసులు 30 వేల దిగువకు చేరగా మరణాలు 400 దిగువకు పడిపోయాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
తాజాగా 15,11,313 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 28,204 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కేసులు 20 శాతం మేర తగ్గాయి. నిన్న 373 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. కేసులు, మృతుల సంఖ్యలో మార్చి నాటి తగ్గుదల కనిపిస్తోంది. దాంతో ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.19 కోట్లకు చేరగా 4.28 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోసారి క్రియాశీల కేసులు నాలుగు లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం 3.88 లక్షల మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.21 శాతానికి తగ్గగా రికవరీ రేటు 97.45 శాతానికి పెరిగింది. నిన్న 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.11 కోట్లకు చేరాయి. మరోపక్క నిన్న టీకా తీసుకున్నవారి సంఖ్య 54,91,647 గా ఉంది. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 51,45,00,268కి చేరింది.