Kerala Floods: కేరళలో వరదల విధ్వంసం

*రాష్ట్రాన్ని కన్నీటి సంద్రంగా మార్చిన వర్షాలు *రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది మృతి *ఆప్తులను, ఆస్తులను పొగొట్టుకున్న బాధితులు

Update: 2021-10-18 06:09 GMT

కేరళలో వరదల విధ్వంసం(ఫైల్ ఫోటో)

Kerala Floods: భారీ వర్షాలు కేరళలో విధ్వంసం సృష్టించాయి. రాష్ట్రాన్ని కన్నీటి సంద్రంగా మార్చాయి. వేల మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానల కారణంగా 26 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో ఒక్క కొట్టాయం జిల్లా వాసులే 13 మంది. ఇడుక్కి జిల్లాలో తొమ్మిది మంది, అలప్పుజలో నలుగురు చనిపోయారు. కేరళలో తాజా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. 

కేరళకు అన్నివిధాలా అండగా ఉంటామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భరోసా ఇచ్చారు. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కొట్టాయంలోని కూటికల్‌ గ్రామంలో ఓ ఇల్లు నేలమట్టమైన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. మృతదేహాలు బురదలో కూరుకుపోయి కనిపించాయి. వారు ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉండటం పలువురిని కంటతడి పెట్టించింది. వర్షాలు, కొండచరియల దెబ్బకు ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఆప్తులు, ఆస్తులను కోల్పోయి చాలామంది బోరున విలపించడం కనిపించింది.

కొట్టాయంలోని కూటికల్‌, ఇడుక్కిలోని కొక్కాయర్‌లలో ప్రజలకు ఆహార పొట్లాలు, నిత్యావసర సరకులు అందించేందుకు నౌకాదళ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. పథనంతిట్టలోని పలు ప్రాంతాల్లో నీటిలో చిక్కుకున్న 80 మందిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. వర్షాల తీవ్రత తగ్గినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం విజయన్‌ సూచించారు. తిరువనంతపురం, కొల్లం, పథనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్‌, పాలక్కడ్‌, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

Tags:    

Similar News